– జస్టిస్ అభినంద్ కుమార్ షావలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిప్రెషన్‌లో ఉన్న పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ జుడీషియల్ అకాడమీ అధ్యక్షులు జస్టిస్ అభినంద్ కుమార్ షావలి సూచించారు. సోమవారం సికింద్రాబాద్‌లో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలంగాణ స్టేట్ జుడీషియల్ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ఒక రోజు రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, నివాస ప్రాంతాల్లో క్రీడా మైదానాలకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. పిల్లలకు విద్యతో పాటు నైతిక విలువలను బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్యామ్ కోషీ, జస్టిస్ టి.వినోద్ కుమార్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎస్.గోవర్థన్ రెడ్డి, జుడీషియల్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.వెంకట్ రామ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హౌళీకేరి తదితరులు పాల్గొన్నారు.