బలవంతపు చర్యలు చేపట్టవద్దు !

– హైదరాబాద్‌ వర్సిటీ ప్రొఫెసర్‌కు రక్షణ కల్పించిన సుప్రీం
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, విద్యావేత్త ఖామ్‌ ఖాన్‌ సువాన్‌ హసింగ్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా సుప్రీం కోర్టు సోమవారం ఆయనకు రెండు వారాలు రక్షణ కల్పించింది. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆన్‌లైన్‌ వార్తా పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఆయనపై నేరపూరితమైన చర్యలు తీసుకోకుండా సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్‌లోని సంబంధిత కోర్టు నుండి తగు రీతిలో ఉపశమనం పొందడానికి హసింగ్‌కు ఊపిరి పీల్చుకోవడానికి కొంత సమయం దొరుకుతుందని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ పేర్కొంది. శతృత్వాన్ని పెంపొందించడం, తప్పుడు ప్రకటనలు చేయడం, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడంతో సహా ఐపిసి కింద పలు అభియోగాలను ఆయనపై మోపారు. మీడియ ఇంటర్వ్యూ ప్రాతిపదికగా తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని జులై 6న సోషల్‌మీడియా ద్వారా తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యానని హసింగ్‌ చెప్పారు. ఆ తర్వాత ఇంఫాల్‌ ఈస్ట్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (సిజెఎం) హసింగ్‌కు సమన్లు జారీ చేసింది. తాను భారత పౌరుడిని కానని అంటూ తనపై వచ్చిన నిరాధార ఆరోపణలనుండి రక్షణ కల్పించాల్సిందిగా ప్రొఫెసర్‌, న్యాయ స్థానాన్ని అర్ధించారు.

Spread the love