న్యూఢిల్లీ : అనైతిక వ్యవహార శైలికి పాల్పడుతున్న టెలివిజన్ చానెళ్లకు అడ్డుకట్ట వేయడానికి కేవలం లక్ష రూపాయిలు జరిమానా విధిస్తే సరిపోదని, ఆ షో ద్వారా మీడియా సంస్థలు ఆర్జించే లాభాలకన్నా రెట్టింపు మొత్తం జరిమానా విధించడం సముచితంగా వుంటుందని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యా నించింది. మీడియా నైతిక నిబంధనావళికి మరింత పదును పెట్టే విషయాన్ని సుప్రీం యోచిస్తోంది. రూ.లక్ష జరిమానా విధించడమన్నది 2008లో జరిగిందని, అప్పటి నుండి దాన్ని సవరించలేదని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృ త్వంలోని బెంచ్ పేర్కొంది. నిబంధనలను, నియంత్రణలను బలోపేతం చేసే ఫ్రేమ్‌వర్క్ అంశంపై స్వతంత్ర ఎలక్ట్రానిక్ మీడియా పర్యవేక్షక సంస్థ అయిన ఎన్‌బిడిఎ (నేషనల్ బ్రాడ్‌కాస్టర్ అండ్ డిజిటల్ అసోసియేషన్)కు, కేంద్రానికి, ఇతర ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. టెలివిజన్ చానెళ్ళలో మాట్లాడే వాక్ స్వేచ్ఛ గురించి తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని చంద్రచూడ్ పేర్కొన్నారు.