– హర్యానాలో హిందూత్వ సంస్థల డిమాండ్
– నుహ్ సమీపంలో మహాపంచాయత్ నిర్వహణ
– పోలీసుల షరతులను ఉల్లంఘిస్తూ సమావేశం
హర్యానా: హర్యానాలో హిందూత్వ శక్తులు తన రెచ్చగొట్టే విధానాన్ని మానుకోవటం లేదు. మత ఘర్షణలు చెలరేగిన నుహ్ సమీపంలో నిర్వహించిన మహాపంచాయత్‌లో హిందూత్వ సంస్థలు ‘ఆత్మ రక్షణ’ కోసం తుపాకులను డిమాండ్ చేశాయి. హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ జిల్లాలలో మత హింస జరిగిన రెండు వారాల తర్వాత హిందూత్వ గ్రూపులు పొరుగున ఉన్న పల్వాల్‌లో మహాపంచాయత్ నిర్వహించాయి. సమాజాన్ని రక్షించడానికి తుపాకీ లైసెన్స్‌లను డిమాండ్ చేశాయి. అంతేకాకుండా, ఒక వర్గం ప్రజలపై విద్వేషపూరిత ప్రసంగాలను చేశాయి. ‘సర్వ్ హిందూ సమాజ్’ బ్యానర్‌పై నిర్వహించిన ఈ సమావేశం నుహ్ సరిహద్దులో ఉన్న పల్వాల్‌లోని పోండ్రి గ్రామంలో జరిగింది.
నుహ్ లోని కార్యక్రమానికి తొలుత పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే, హాజరయ్యే వారు ఆయుధాలు కలిగి ఉండరాదనీ, ద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదనే షరతుతో పాల్వాల్‌లో ఈవెంట్‌ను నిర్వహించ డానికి పోలీసులు అనుమతించారు. అయినప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఆ షరతులను ఉల్లంఘించారు. పరిపాలనపై సవాల్ విసిరారు. గన్ లైసెన్స్‌ల డిమాండ్‌ను వినిపించారు. హర్యానా గోరక్షక్ దళ్, గో సంరక్షణ బృందం చీఫ్ ఆజాద్ సింగ్ ఆర్య.. ఈ ప్రాంతంలోని ప్రతి హిందూ గ్రామానికి 100 ఆయుధాలు ఉండాలని డిమాండ్ చేశారు. ”ప్రతి ఒక్కరూ రైఫిల్ పొందాలి. రివాల్వర్ కాదు. ఎందుకంటే రివాల్వర్లు చాలా దూరం కాల్చవు” అని అతను ఈవెంట్‌లో చెప్పిన ఒక వీడియో బయటకు వచ్చింది. మనోహరలాల్ ఖట్టర్ ను దించి యోగి ఆదిత్యనాథ్ వంటి సీఎంను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో జునైద్, నాసిర్ అనే ఇద్దరు ముస్లింలను హత్య చేసి జైలుకెళ్లిన గోసంరక్షకులకు తాను సెల్యూట్ చేస్తున్నానని ఆర్య తెలిపారు.
మరొక వ్యక్తి మాట్లాడుతూ.. ”మీరు వేలు ఎత్తితే, మేము మీ చేతులు నరికివేస్తాము” అని ఒక మతాన్ని ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని ఏకైక ముస్లిం మెజారిటీ జిల్లా అయిన నుహ్ ను రద్దు చేయాలని కూడా మహాపంచాయత్ డిమాండ్ చేసింది. జిల్లాను గోహత్య రహితంగా మార్చాలని ఈ కార్యక్రమంలో హిందూత్వ శక్తులు డిమాండ్ చేశాయి. గతనెల 31న నుహ్ లో చెలరేగిన హింసను జాతీయ దర్యాప్తు సంస్థ పరిశీలించాలని తెలిపాయి. కాగా, హిందూత్వ శక్తుల డిమాండ్‌లను సామాజికవేత్తలు తప్పుబట్టారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వం నియంత్రించాలనీ, లేకపోతే పరిస్థితులు చేజారిపోతాయని హెచ్చరించారు.