వలస కార్మికులకు హిందూత్వ శక్తుల బెదిరింపులు

For migrant workers
Threats of Hindutva forces–  హర్యానాను వీడుతున్న వందలాది మంది
చండీగఢ్‌ : హర్యానాలో నివసిస్తున్న వందలాది మంది ముస్లిం వలస కార్మికులు భయాందోళనలో ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో నుహ జిల్లాలో మత ఘర్షణల తర్వాత చెలరేగిన హింస కారణంగా వందలాది మంది ముస్లిం వలస కార్మికులు ఇక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వలస వచ్చిన వారు వెళ్లిపోవాలంటూ బెదిరింపులు వచ్చాయి. నుహలో కర్ఫ్యూ కారణంగా కార్మికులు వెళ్లిపోవడానికి కూడా పరిస్థితులు క్లిష్టంగా మారాయి. వారిలో చాలా మంది హింసాత్మక జిల్లా నుంచి పారిపోయే ప్రయత్నంలో అల్వార్‌ లేదా సోహ్నా వైపు వెళ్తున్నట్టు ఒక వార్తాపత్రిక వెల్లడించింది.సోమవారం విశ్వ హిందూ పరిషత్‌ ఊరేగింపును నిలిపివేసిన తర్వాత నుహలో చెలరేగిన హింసలో ఇద్దరు హౌంగార్డులు, ఒక ఇమామ్‌తో సహా కనీసం ఆరుగురు మరణించిన విషయం విదితమే. నూహకు పొరుగున ఉన్న జిల్లాలకు హింస వ్యాపించడంతో, గురుగ్రామ్‌లో ఒక మసీదు దహనానికి గురైంది. అలాగే, ముస్లిం వలస కుటుంబాలను ఖాళీ చేయాలని హిందూత్వ శక్తులు బెదిరించాయి. అటు తర్వాత వాటిని తగులబెట్టారు. ”మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు మోటారు సైకిళ్లపై వచ్చారు. మేము ఇక్కడి నుంచి వెళ్లకపోతే వారు మా వాడకు నిప్పు పెడతామని బెదిరించారు” అని వలస రిక్షా డ్రైవర్‌ రెహ్మత్‌ అలీ తెలిపాడు. ”రాత్రి నుంచి పోలీసులు ఇక్కడ ఉన్నారు. కాని నా కుటుంబం భయ పడింది. మేము నగరం నుంచి బయలుదేరు తున్నాము” అని అలీ వాపోయాడు. అయితే, వారు వలస వెళ్తున్న దృశ్యాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పరిస్థితులను అదుపులోకి తీసురావటంలో విఫలమవుతున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై నెటిజన్లు, సామాజికవేత్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మసీదులకు నిప్పుపెట్టేందుకు దుండగులు యత్నం
మత ఘర్షణలు చెలరేగిన మూడు రోజుల తర్వాత కూడా హర్యానా జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హిందూత్వ శక్తుల ఆగడాలు, బెదిరింపులు ఇంకా తగ్గు ముఖం పట్టటం లేదు. బుధవారం రాత్రి నుహలోని టౌరు పట్టణంలో గుర్తు తెలియని దుండగులు రెండు మసీదుల కు నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. నుహ కర్ఫ్యూలో ఉన్న సమయంలో కూడా రాత్రి 11.30 గంటల ప్రాంతం లో రెండు మసీదులపై దాడులు జరగటం గమనార్హం. ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు నుహలోని రెండు మసీదులపై క్రూడ్‌ పెట్రోల్‌ బాంబులు విసిరి, స్వల్ప నష్టం కలిగించారని సాక్షులు తెలిపారు. మం టలను ఆర్పేందుకు అగ్నిమాపక దళం ఇంజిన్‌లను పంపిన ట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఎవరూ కాల్పులకు ప్రయత్నించడం తమకు కనిపించలేదని వెల్లడించారు.
ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసు అధికారి తెలిపారు. పెద్దగా నష్టం జరగలేదని, మసీదులో ఉంచిన కార్పెట్‌ మాత్రమే పాక్షికంగా కాలిపోయిందని చెప్పారు.

Spread the love