ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా కుప్పకూలిన హెలికాప్టర్..

నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నిక ప్రచారంలో భాగంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన సుష్మా అంధారే.. ప్రయాణించాల్సిన హెలికాప్టర్.. ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయివేటు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ప్రమాదం జరుగుతుందని ముందే గుర్తించిన పైలట్.. అలర్ట్ అయి హెలికాప్టర్ నుంచి బయటికి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు, అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని మహద్ పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందిన సుష్మా అంధారేను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయివేటు హెలికాప్టర్‌ను.. ఓపెన్ గ్రౌండ్‌లో ల్యాండింగ్‌ చేస్తుండగా.. అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి హెలికాప్టర్ కూలిపోతున్న దృశ్యాలను సుష్మా అంధారే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. హెలికాప్టర్ కూలిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున ధూళి వ్యాపించింది. ఆ సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

Spread the love