నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ తెలుగు, సంస్కృత భాషా పండితులు, రిటైర్డ్ అధ్యాపకులు కండ్లకుంట అళహ సింగరాచార్యులు(93) మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుమారుడు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమవారం ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సింగరాచార్యులు సాహిత్యరంగంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు. అధ్యాపకులు, ఉపన్యాసకులు, రచయిత, వ్యాకరణ పండితుడిగా తెలుగు, సంస్కృత భాషలకు ఆయన చేసిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం బాధాకరమని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ సంతాపం తెలిపారు. సంస్కృతాంధ్ర భాషలకు సింగరాచార్యులు విశిష్ట సేవలు అందించారని ఆయన శిష్యులు రాపోలు సుదర్శన్, సమ్మెట నాగమల్లేశ్వరరావు, తదితరులు గుర్తుచేసుకున్నారు.