మూడేండ్ల తర్వాత గ్రీవెన్స్‌

– నేటి నుంచి ప్రజా సమస్యలను విననున్న కలెక్టర్‌
– కొవిడ్‌-19తో మూగబోయిన ప్రజావాణి
– ఇక నుంచి ప్రతి సోమవారం నిర్వహణ
– ప్రతి దరఖాస్తుదారుడి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు
– హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ఏర్పాట్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గడిచిన మూడేండ్లుగా హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మూగబోయిన ప్రజావాణి నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా 2020 మార్చి నుంచి ప్రజావాణికి బ్రేక్‌ పడింది. మధ్యలో ఈ ఏడాది మే మాసంలో రెండు వారాలపాటు ప్రజావాణి నిర్వహించి.. కలెక్టరేట్‌ తరలింపుతో బంద్‌ పెట్టారు. మళ్లీ ఇన్నాండ్ల తర్వాత ప్రతి వారం ప్రజావాణి నిర్వహించేందుకు హైదరాబాద్‌ జిల్లా యంత్రాంగం సిద్దమవుతోంది. ఇందులో వచ్చే ప్రతి దరఖాస్తుదారుడి సమస్యలను పరిష్కరించే విధంగా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆదేశాలతో అధికారులు ప్రజావాణిని పకడ్బందీగా చేపట్టనున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో కోవిడ్‌-19 ప్రభావంతో ప్రజావాణి నిర్వహించకపోవడంతో నగరవాసులు తమ సమస్యలు ఎవరికి విన్నవించుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రజావాణి లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు తమ అర్జీలను పట్టించుకునేవారు కాదు. దీంతో సమస్యలు ఎక్కడికక్కడ అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, సదరం సర్టిఫికెట్స్‌, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, సంక్షేమ రుణాలు, దళితబంధు, విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌, సర్టిఫికెట్లు తదితర సమస్యలపై నిత్యం ప్రజలు కలెక్టరేట్‌కు వస్తుంటారు. గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించకపోవడంతో జనం తమ అర్జీలు ఎవరికి సమర్పించాలో తెలియక అక్కడున్న సిబ్బందికి ఇచ్చి వెళ్లేవారు. అలా ఇచ్చే దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఏమైనా అత్యవసర సమస్యలు ఉంటే కలెక్టర్‌ను నేరుగా కలిసి తమ గోడు వెళ్లబోసుకునేవారు. మళ్లీ ఇన్నాండ్ల తర్వాత ప్రజావాణి పున:ప్రారంభమవుతుండటంతో దరఖాస్తుదారులు కలెక్టరేట్‌కు క్యూ కట్టనున్నారు. సాధారణ రోజుల్లోనే ప్రజావాణికి పెద్దఎత్తున్న జనం బారులు తీరుతుంటారు. ఇకపై ప్రభుత్వం చేపడుతున్న కీలక సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, దళితబంధు, బీసీ, మైనార్టీలకు రూ.లక్ష సాయం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, డబుల్‌ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులు భారీగా రానున్నాయి. వీటితో పాటు నోటరీ భూముల క్రమబద్ధీకరణ, ఇతర భూసమస్యలతో పాటు ఇతర సంక్షేమ పథకాల కోసం అర్జీదారులు నేటి నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్‌ బాట పట్టనున్నారు.
ముచ్చటగా రెండు వారాలు..!
కరోనా నేపథ్యంలో అన్ని కలెక్టరేట్ల మాదిరిగా హైదరాబాద్‌లో సైతం 2020 మార్చి నెల నుంచి ప్రజావాణి కార్యక్రమం నిలిచిపోయింది. ఆ ఏడాది ఆగస్టు నుంచి ఈ-ఆఫీస్‌ ద్వారా కాగితరహిత పాలనకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ ప్రవేశమార్గం వద్ద ప్రత్యేక బాక్స్‌ ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించగా.. మండలాల్లోనూ తహసీల్దార్ల ఆఫీసుల్లో బాక్స్‌లు, వాట్సాప్‌, ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం పునరుద్ధరించారు. కానీ హైదరాబాద్‌ జిల్లాలో పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. అయితే, గత మే నెలలో 8, 15వ తేదీల్లో రెండు వారాలపాటు ప్రజావాణి నిర్వహించారు. ఆ తర్వాత అబిడ్స్‌లోని కలెక్టరేట్‌ను ప్రస్తుత రంగారెడ్డి కలెక్టరేట్‌కు తరలిస్తున్నామనే సాకుతో నిలిపివేశారు.
దాదాపు మూడేండ్ల నుంచి గ్రీవెన్స్‌ సెల్‌ లేకపోవడంతో దరఖాస్తుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌కు రానున్నారు.
సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నాం. దరఖాస్తులతో వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటాం. ప్రాధాన్యత గుర్తించి వచ్చిన విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించాం.

Spread the love