ఆత్మకథలు అందరూ రాయాలి

Everyone should write autobiographies– ‘నిఖిల లోకం, సాహిత్య సంగమం’ పుస్తకావిష్కరణలో పలువురు వక్తలు
– దిగంబర సంపుటే నాకు స్పూర్తి :కె.శివారెడ్డి
– నిఖిలేశ్వర్‌ ఆత్మకథ రెండో భాగమూ రాయాలి: కె.శ్రీనివాస్‌
– నాకూ అసంతృప్తిగానే ఉంది : కవి నిఖిలేశ్వర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఆత్మకథలు అందరూ రాయాలి. ముఖ్యంగా ప్రముఖులు తప్పనిసరిగా రాయాల్సిందే. అవే నేటి తరానికి స్ఫూర్తి. ప్రేరణగా నిలుస్తాయి’ అని పలువురు వక్తలు అన్నారు. బాగ్‌అంబర్‌పేట్‌లో ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కవి నిఖిలేశ్వర్‌ రచించిన ‘నిఖిల లోకం, సాహిత్య సంగమమం’ పుస్తకాలను కవి నగ్మముని ఆవిష్కరించారు. అనంతరం కె.శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ దిగంబర సంపుటినే నాకు స్ఫూర్తి, ప్రేరణ కల్గించాయని అన్నారు. ప్రేరణ కల్గించిన వ్యక్తిని, పుస్తకాలను మరిచిపోకూడదని, మరిచిపోతే ద్రోహం అవుతుందన్నారు. వస్తువు మారితే భాష కూడ మారాలనీ, మారితే విప్లవమవుతుందనీ, మారకపోతే బాధ అవుతుందనీ, దీనిలో చాలా వెనుకబడి ఉన్నామని తెలిపారు. నగ్మముని మాట్లాడుతూ ఆత్మకథలో కొత్త విషయాలు వెలుగులోకొస్తాయని అన్నారు. 40ఏండ్ల పాటు అసెంబ్లీలోనే పనిచేశానని గుర్తుచేశారు. దిగంబర కవిత్వానికి రాజకీయ అనుభవం కూడ కలిసొచ్చిందన్నారు. నిఖిల లోకం పుస్తక పరిచయకర్త డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అందరి ఆత్మకథలు సంచలనాలు కావన్నారు. కొన్ని చరిత్రను పరిచయం చేస్తాయన్నారు. ‘సాహిత్య సంగమం’ పుస్తక పరిచయకర్త జతిన్‌కుమార్‌ మాట్లాడుతూ సమాజానికి ప్రేరణనిచ్చిన 35 మంది వ్యక్తుల అనుభవాల సారాంశమే ‘సాహిత్య సంగమం’ అన్నారు. సమకాలిన పరిస్థితుల్లో ఆత్మకథను రాసుకోవడం కష్టమేననీ, నిఖిలేశ్వర్‌ మెత్తటి మనిషనీ, కానీ ఆయన అభిప్రాయం మాత్రం గట్టిగానే ఉంటుందన్నారు. కవులు కాకపోయిన కవిత్వం రాసే కవులు, రచయితలకు అండగా నిలిచిన దేవులపల్లి వెంకట్రామయ్య, తరిమిల నాగిరెడ్డి ప్రస్తావన స్ఫూర్తినిచ్చిందన్నారు. అంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడూతూ నిఖిలేశ్వర్‌ ఆత్మకథ ‘నిఖిల లోకం’ పుస్తకానికి తాను ముందు మాట రాశానని, అసంపూర్తిగానే ఉందనీ, రెండో భాగమూ రాయాలని అన్నారు. తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేని మనిషని, ఆయన వ్యక్తిత్వంలో తెలంగాణ తనం ఉట్టిపడిందన్నారు. కవి ఓల్గా మాట్లాడుతూ నిఖిలేశ్వర్‌, జ్వాలముఖి వేసిన నాటకం అందరిని ఆకట్టుకుందన్నారు. నిఖిలేశ్వర్‌, ఆయన భార్య యామినితో ఎంతో అనుబంధం ఉండేదని గుర్తుచేశారు. ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ విగ్రహంలా ఉన్న నిఖిలేశ్వర్‌కు నిగ్రహం కూడా ఉందన్నారు. ఆయన అరమరికల్లేని మనిషన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ లెనిన్‌ శతజయంతి సభలో ‘ఎరుపే నిజం..నిజం..నిజం’ అని జ్వాలముఖి అన్నారని, తర్వాత వచ్చిన నిఖిలేశ్వర్‌ కూడా ‘మా మిత్రుడు జ్వాలముఖి చెప్పిందే నిజం..అదే నిజం…అదే నిజం. లెనిన్‌ మీ వాడు, మా వాడు, మన అందరివాడు’ అన్నారని గుర్తుచేశారు. వామపక్ష ప్రజాస్వామిక కవుల సంఘంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ శివారెడ్డి-దేవిప్రియ, జ్వాలముఖి-నిఖిలేశ్వర్‌ జంట కవులుగా పేరుగాంచారని గుర్తుచేశారు. వారి మాదిరిగానే తాము రఘునాథ్‌-సిధారెడ్డి జంటగా ఏర్పడ్డామని తెలిపారు. నిఖిలేశ్వర్‌ ఆకలి, అప్యాయత తెలిసినవారని కొనియాడారు. ఆయన్ను ఇష్టపడ్డా..ప్రేమించా..ఆయన కవిత్వాన్ని అస్వాదించానని చెప్పారు. ఆయన రాసిన పుస్తకంలో ‘రాత్రిళ్లో క్షుద్రత్వం నగరంలోని వేశ్యకు తెలుసు…అడవిలోని అమరత్వం గెరిల్లాకు తెలుసు’ ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. జీవన్‌కుమార్‌ మాట్లాడుతూ యుద్ధం, విప్లవంలో కవుల పాత్ర ఎనలేనిదన్నారు. కవి నిఖిలేశ్వర్‌ మాట్లాడుతూ ‘నా ఆత్మకథలో ఎంతో దాచిపెట్టాను. అధ్యాత్మికం నుంచి మార్క్సిస్టు వరకు ఎన్నో అనుభవాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఉద్యమం తననెంతో తీర్చిదిద్ధందన్నారు. కుటుంబ సభ్యులవల్లనే ఇప్పటినీ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. అంతకుముందు ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌, సియాసత్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌లకు నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో నిఖిలేశ్వర్‌ కుమారులు రాహుల్‌, సమీర్‌, కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు తదతరులు పాల్గొన్నారు.

Spread the love