సోషల్‌ మీడియా డీపీగా జాతీయ జెండా

 National Flag as Social Media DP– దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు
– ఆగస్టు 15 నుంచి 20 వరకు సెల్ఫీ పాయింట్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు కేంద్రం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తప్పకుండా తమ సోషల్‌ మీడియాల్లో డిపిగా జాతీయ జెండాను పెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ట్వీట్‌ చేశారు. దేశం, మన మధ్య బంధాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని తెలిపారు.”స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో మనమంతా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోషల్‌ మీడియా ఖాతాల డీపీలో జాతీయ జెండాను ఉంచుదాం. దేశానికి, మనకు మధ్య బంధాన్ని పెంపొందించే ఈ కార్యక్రమానికి మన వంతు మద్దతునిద్దాం”అని ప్రధాని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.
12 సెల్ఫీ పాయింట్లు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పలు చోట్ల సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి.. పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సెల్ఫీ పాయింట్లను దేశ రాజధానిలోని 12 ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. ఆ పాయింట్ల వద్ద ఫోటోలు తీసుకొని ‘మై గవ్‌’ పోర్టల్లో అప్‌లోడ్‌ చేయవచ్చు. ఈ పోటీలు ఆగస్టు 15 నుంచి 20 వరకు జరుగుతాయి. ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను కూడా పంచుకోవచ్చు. సెల్ఫీలు పంపిన వారిలో 12 మందిని ఎంపిక చేసి ఒకొక్కరికి రూ.10 వేలు చొప్పున బహుమతి అందిస్తాం’ అని రక్షణ శాఖ పేర్కొంది.
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్తరాఖండ్‌ లో ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళకు ఆహ్వానం పంపారు. ఆమె గత ఏడాదిలో మోడీకి యాపిల్‌ పచ్చడి పంపిన మహిళ. అయితే ఈ అతిథుల్లో గ్రామ సర్పంచులు (వైబ్రెంట్‌ విలేజెస్‌), పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం, పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన పథకం లబ్దిదారులు కూడా ఉన్నారు. వీరితో పాటూ ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు, ఖాదీ రంగానికి చెందిన శ్రామికులు తదితరులను వేడుకలకు ఆహ్వానించినట్లు కేంద్ర రక్ష మంత్రిత్వ శాఖ తెలిపింది. 15 (మంగళవారం)న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమంలో వీరందరూ పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టు 15 వేడుకలకు 1,800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది. దీంతోపాటు 17,000 మంది ఆహ్వానితులకు ఈ ఆహ్వానాలు అంద జేశారు.

Spread the love