పెరుగుతున్న ఎరువుల ధరలు

– కలవరపడుతున్న కమలనాథులు
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘర్‌, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ రాష్ట్రాలలో ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకొని, ఆ ఊపుతో లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని చూస్తున్న బీజేపీ అంతర్జాతీయంగా పెరుగుతున్న ఎరువులు, వాటి ముడి సరుకుల ధరలను చూసి బెంబేలెత్తుతోంది. దిగుమతి చేసుకుంటున్న టన్ను యూరియా ధర గత నెలలో 318-320 డాలర్ల నుండి 395-410 డాలర్లకు పెరిగింది. జూన్‌ చివరలో 285-290 డాలర్లుగా ఉన్న ధర ఆ తర్వాత భారీగా పెరిగింది. ఇక డీఏపీ ధర కూడా పెరుగుతోంది. జూలై రెండో పక్షంలో 435-440 డాలర్లుగా ఉన్న టన్ను ధర రెండు వారాలలోనే 480 డాలర్లకు చేరింది. ఇప్పుడు ఏకంగా 560 డాలర్లు పలుకుతోంది.
డీఏపీ తయారీలో ఉపయోగించే అమ్మోనియా ధర సైతం పైపైకి ఎగబాకుతోంది. గత 45 రోజుల వ్యవధిలోనే దీని టన్ను ధర 300-310 డాలర్ల నుండి 400-405 డాలర్లకు పెరిగిపోయింది. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ఎరువుల ధరలు బాగా పెరిగాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇదే ధోరణి కొనసాగితే అంతర్జాతీయ సరఫరాదారులు నిర్ణయించుకున్న దిగుమతి ధరలో తిరిగి మార్పులు చేసే అవకాశం ఉన్నదని వివరించాయి. ఇదిలావుండగా మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ధర మాత్రం తగ్గుతోంది. మార్చిలో 590 డాలర్లుగా ఉన్న టన్ను ధర ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో 422 డాలర్లకు తగ్గింది.
పెరుగుతున్న ఎరువుల ధరల కారణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానంగా రెండు సమస్యలను ఎదుర్కొంటోంది. మొదటిది ఆర్థికపరమైనది. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి రూ.1,75,100 కోట్లు కేటాయించింది. ఇందులో ఏప్రిల్‌-జూలై త్రైమాసికంలో కేవలం రూ.45,112.53 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. మిగిలిన మొత్తాన్ని మిగిలిన తొమ్మిది నెలల కాలంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే సబ్సిడీ బిల్లు పెరుగుతుంది. ఇక రెండో కారణం రాజకీయాలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఎరువుల ధరలు ప్రభావం చూపుతాయని బీజేపీ ఆందోళన చెందుతోంది. రైతులు కన్నెర్ర చేస్తే ఎన్నికలలో విజయం సాధించడం మాట అటుంచి ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుంది.

Spread the love