– హిండెన్‌బర్గ్ ఆరోపణలపై డెలాయిట్
– అదానీ గ్రూపు నుంచి ఆడిటర్ పదవికి రాజీనామా
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ కంపెనీలో అక్రమాల భాగోతం మరోసారి తెరపైకి వచ్చింది. అదానీ పోర్టుల వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించే లండన్‌కు చెందిన ప్రముఖ ఆడిట్ కన్సల్టెంగ్ సంస్థ డెలాయిట్ ఆడిటర్‌గా వైదొలగటానికి ముందు అదానీ గ్రూపుపై అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై స్వతంత్ర బాహ్య విచారణ జరిపించాలని కోరింది. అదానీ అవినీతి, అక్రమాలపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు ఇది మరింత బలం చేకూర్చుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ ప్రభుత్వం దన్నుతో హిండెన్‌బర్గ్ రిపోర్టును బేఖాతరు చేసిన అదానీ గ్రూపు ఇప్పుడు డెలాయిట్ చేసిన సూచనను కొట్టిపడేసింది. ఈ ఆరోపణలు ఏవీ ఆర్థిక నివేదికలపై ఎటువంటి ప్రభావమూ చూపలేదని అదానీ గ్రూపు తెలిపింది. ఆడిటర్ పదవికి రాజీనామా చేయటం కోసం డెలాయిట్ చూపిన కారణాలేవీ నమ్మశక్యంగా లేవని అదానీ గ్రూపు పేర్కొంది. డెలాయిట్ రాజీనామా వెనక పెద్ద కథే ఉందని, స్టాక్ మార్కెట్‌పై ఇది ప్రభావం చూపే అవకాశముందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ ఎలాంటి చర్యలకు ఆదేశించకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
కొన్ని నెలల క్రితమే ఆడిటర్‌గా పదవి పొడిగింపు
కొన్ని నెలల క్రితమే ఆడిటర్‌గా సమయం పొడిగింపు జరిగిన తర్వాత.. అదానీ గ్రూపుకు సేవలు అందించటం నుంచి డెలాయిట్ వైదొలగటం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది అదానీ గ్రూపుపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
‘మేము అదానీ ఇతర కంపెనీలకు చట్టబద్ధమైన ఆడిటర్లము కాదు’
ఏపీసెజ్ ఆడిటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆగస్ట్ 12 రాజీనామా లేఖలో డెలాయిట్ పేర్కొన్నది. ”ఎందుకంటే మేము గణనీయమైన సంఖ్యలో ఇతర అదానీ గ్రూప్ కంపెనీలకు చట్టబద్ధమైన ఆడిటర్లం కాదు” అని అందులో వివరించింది. ఈ ఏడాది మార్చి, జూన్ నెలలతో ముగిసిన త్రైమాసికాల ఆర్థిక నివేదికల ఆడిట్‌లో తమ అర్హత కలిగిన అభిప్రాయాన్ని అందించినట్టు పేర్కొన్నది. ఏపీసెజ్.. 2024లో తన తదుపరి వార్షిక సాధారణ సమావేశం జరిగే తేదీ వరకు డెలాయిట్ స్థానంలో బీఓడీ ఇంటర్నేషనల్ స్వతంత్ర సభ్య సంస్థ అయిన ఎంఎస్‌కేఏ అసోసియేట్స్‌ను తన చట్టబద్ధమైన ఆడిటర్‌లుగా నియమించింది. కంపెనీ ఈ విషయాన్ని ఒక ఫైలింగ్‌లో తెలిపింది.
2017 నుంచి ఏపీసెజ్ ఆడిటర్‌గా డెలాయిట్
2017 నుంచి ఏపీసెజ్ ఆడిటర్‌గా ఉన్న డెలాయిట్‌కు గతేడాది జులైలో మరో ఐదేండ్ల పదవీకాలం పొడిగించబడింది. అయితే అదానీ గ్రూపుపై సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై డెలాయిట్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అదానీ గ్రూప్ అవన్నీ నిరాధారమైనవని బుకాయించింది. మోడీ ప్రభుత్వం కూడా అదానీని పూర్తిగా వెనకేసుకొచ్చింది.
స్వతంత్ర బాహ్య విచారణ లేనప్పుడు, సెబీ ద్వారా జరుగుతున్న విచారణ ఇంకా పెండింగ్‌లో ఉన్నందున తాము ఏమీ వ్యాఖ్యానించలేమని డెలాయిట్ తెలిపింది.