సిసోడియా ఆస్తులు జప్తు

– ‘మద్యం’ కేసులో రూ.52 కోట్ల అటాచ్‌
న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆయన భార్య సీమ, ఇతరులకు చెందిన రూ.52.24 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. సిసోడియాకు, ఆయన భార్యకు చెందిన రెండు స్థిరాస్తులను, చరియట్‌ ప్రొడక్షన్‌ మీడియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ జోషీ, గౌతమ్‌ మల్హోత్రాలకు చెందిన భూమి, ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్నామని ఈడీ తెలిపింది. ఈ స్థిరాస్తుల విలువ రూ.7.29 కోట్లు. ఇక రూ.44.29 కోట్ల చరాస్తుల విషయానికి వస్తే సిసోడియా బ్యాంక్‌ డిపాజిట్లు (రూ.11.49 లక్షలు), బ్రిండ్కో సేల్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (రూ.16.45 కోట్లు), ఇతర ఆస్తులను అటాచ్‌ చేశారు. ఇప్పటి వరకూ ఈ కేసులో రూ.128.78 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. సిసోడియాకు సన్నిహితుడిగా భావిస్తున్న ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్‌ అరోరాను అరెస్ట్‌ చేసిన మర్నాడే ఈ ఆస్తుల జప్తు జరిగింది. కాగా సిసోడియా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని అమ్‌ఆద్మీ పార్టీ నేత అతిషి మర్లేనా ఆరోపించారు. సిసోడియా 18 సంవత్సరాల క్రితం ఒక ఫ్లాటు కొనుగోలు చేశారని, 2018లో మరొకటి కొన్నారని, ఎక్సైజ్‌ పాలసీని రూపొందించడానికి ముందే వీటి కొనుగోలు జరిగిందని ఆయన చెప్పారు.

Spread the love