– విలువ రూ.2.72 లక్షల కోట్లు
– ఆర్‌బీఐ వెల్లడి
న్యూఢిల్లీ : చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 76 శాతం కరెన్సీని ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఈ పెద్ద నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు మే 19న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2023 జూన్ 30 నాటికి బ్యాంక్‌లకు తిరిగి వచ్చిన మొత్తం నోట్ల విలువ రూ. 2.72 లక్షల కోట్లుగా ఉందని తాజాగా వెల్లడించింది. మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్ల పెద్దనోట్లు చలామణిలో ఉన్నాయి. మే 19 నాటికి రూ.3.56 లక్షల కోట్లు చెలామణిలో ఉండగా.. ఇప్పటి వరకు 76 శాతం రిటర్న్ వచ్చాయని తెలిపింది. మే1 నాటికి మార్కెట్‌లో ఇంకా రూ.84,000 కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. చెలామణి నుండి తిరిగి వచ్చిన రూ. 2,000 మొత్తం నోట్లలో 87శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగిలిన 13శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పిడి జరిగిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కాగా.. 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. మే19న ఉపసంహరణ ప్రకటన సమయంలో వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు ఉందని.. ఆ లోపు నోట్లను మార్చుకోవాలని ఆర్‌బిఐ మరోమారు గుర్తు చేసింది. 2016లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసి తర్వాత రూ.2వేల నోట్లను మోడీ సర్కార్ ప్రవేశపెట్టింది. తిరిగి ఎందుకు ఉపసంహరించుకుంటుందో మాత్రం ప్రకటన చేయలేదు.