సంజూ శాంసన్‌కు భారీ జరిమానా..

నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్‌ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కఠిన చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2024లో భాగంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. తన క్యాచ్ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదం చేయడంతో.. సంజూ మ్యాచ్‌ ఫీజ్‌లో 30 శాతం జరిమానాను ఐపీఎల్ అధికారులు విధించారు. రాజస్థాన్‌ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా విధించినట్లు ఐపీఎల్ అడ్వైజరీ ఓ ప్రకటన జారీ చేసింది. ‘రాజస్థాన్‌ రాయల్స్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మ్యాచ్‌ ఫీజ్‌లో 30 శాతం జరిమానా విధిస్తున్నాం. మే 7న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఈ ఫైన్‌ పడింది. సంజూ ఆర్టికల్ 2.8 లెవల్‌ 1 నేరానికి పాల్పడినట్లు తేలింది. అతడు తన నేరాన్ని అంగీకరించాడు. మ్యాచ్‌ రిఫరీ నిర్ణయం మేరకు జరిమానా విధించాం’ అని పేర్కొంది.
ముకేశ్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్లోని నాలుగో బంతిని సంజూ శాంసన్‌ లాంగాన్‌ వైపు భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్‌ వద్ద షాయ్ హోప్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే క్యాచ్‌ పట్టాక హోప్‌ ఎడమ పాదం బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో కనిపించింది. అయితే రీప్లే పరిశీలించాక థర్డ్ అంపైర్‌ ఔటిచ్చాడు. థర్డ్ అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి చెందిన సంజూ.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అప్పటికి అతడు సెంచరీకి చేరువలో ఉండగా.. జట్టు స్కోరు 162గా ఉంది. రాజస్థాన్ విజయానికి ఇంకా 26 బంతుల్లో 60 రన్స్ చేయాల్సి ఉంది. చివరికి రాజస్థాన్‌ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Spread the love