వేదాంతకు భారీ షాక్‌

– టాటాతో ఫాక్స్‌కాన్‌ జట్టు..!
న్యూఢిల్లీ : కార్పొరేట్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌కు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ భారీ షాక్‌ ఇచ్చింది. భారత్‌లో చిప్‌ల తయారీకి వేదాంతతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోగా.. తాజాగా టాటా గ్రూపునతో కలిసి ముందుకు సాగాలని భావిస్తోన్నట్లు సమాచారం. ఇందుకోసం టాటా గ్రూపునతో సంయుక్త భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతోందని రిపోర్టులు వస్తోన్నాయి. మరో రెండు కంపెనీలతోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. భారత్‌ ఒక బలమైన సెమీకండక్టర్‌ తయారీ పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా స్థాపించాలని చూస్తోన్నామని ఫాక్స్‌కాన్‌ తెలిపింది. సరైన భాగస్వాముల కోసం సమీక్షిస్తున్నామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ వాటాదారులను స్వాగతించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. గుజరాత్‌లో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు గతేడాది వేదాంతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా పరస్పర ఆలోచనలతోనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సరైన భాగస్వామి దొరక్కపోతే సొంతగానే ప్లాంట్‌ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు రిపోర్ట్‌లు వస్తోన్నాయి.

Spread the love