వరంగల్ లో మక్కజొన్న రైతు సజీవ దహనం

నవతెలంగాణ వరంగల్‌: మక్కజొన్న చొప్పను కాల్చుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని రైతు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు(65)తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టాడు. అనుకోకుండా మంటలు వ్యాపించి పక్కనే మరో రైతుకు చెందిన ఆయిల్‌ పామ్‌ తోటకు వ్యాపించాయి. దీంతో మంటలను ఆర్పేందుకు వెళ్లిన పాపారావు ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక సజీవ దహనమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వం దవాఖానకు తరలించినట్టు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ తెలిపారు. రైతు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love