వరంగల్‌ ఎంజీఎంలో కరెంట్‌ లేక.. ఆర్‌ఐసీయూలో రోగి మృతి?

నవతెలంగాణ హన్మకొండ: వరంగల్‌ ఎంజీఎం అస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ అంతరాయంతో చికిత్స పొందుతున్న ఓ రోగి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో బొజ్జ బిక్షపతి (45)కి అమర్చిన వెంటిలేటర్‌ పనిచేయకపోవడంతో శ్వాస సమస్య తీవ్రమై మృతిచెందినట్టు మృతుడి బంధువులు ఆరోపించారు.
నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆర్ఐసీలో చికిత్స పొందుతున్నాడు. అయితే శుక్రవారం విద్యుత్ అంతరాయంతో ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కాసేపటి వరకు పనిచేసి ఆగిపోయింది. అదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి జనరేటర్‌ ఆన్‌ చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ జనరేటర్ పని చేయకపోవటంతో ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అయి రోగి బిక్షపతి మృతి చెందాడు.
ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడింది వాస్తమేనని, జనరేటర్‌ పనిచేస్తున్నప్పటికీ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సరఫరా జరగాల్సిన వైరింగ్‌ కాలిపోయిందని తెలిపారు. కానీ.. బాధితుడు మృతిచెందిన సమయంలో వెంటిలేటర్‌ బ్యాటరీ బ్యాకప్‌తో కొనసాగుతూనే ఉన్నదని వివరించారు. బాధితుడి మృతికి విద్యుత్తు అంతరాయం కారణం కాదని, వ్యాధి తీవ్రతతో అంతర్గత రక్తస్రావం జరిగి.. రక్తపు వాంతులు ఎక్కువై మృతి చెందాడని స్పష్టం చేశారు. అర్ధరాత్రి సమయానికి విద్యుత్తు పునరుద్ధరణ జరిగినట్టు తెలిపారు. ఎంజీఎం అత్యవసర విభాగంతోపాటు పలు విభాగాల్లో ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా విద్యుత్తు మరమ్మతులు చేపట్టనున్నట్టు వెల్లడించారు.

Spread the love