నవతెలంగాణ ములుగు: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్టు తెలిపారు. ములుగులోని తన క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారి సంఘాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీని ప్రకటించామని తెలిపారు. ఆటోడ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్నారు.