– రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం
– హైరానాలో అభ్యర్థులు అంతుచిక్కని ఓటర్ నాడీ
నవతెలంగాణ మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల సమయానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో మంథని నియోజకవర్గ అభ్యర్థులు మరింతా హడావిడి పడుతున్నారు. రేపు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం కావడంతో భారీ ర్యాలీలు,ప్రచారాలతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ , బీఎస్పీలు హోరెత్తిస్తున్నాయి. అగ్ర నాయకులతో గట్టిగా ప్రచారం చేయించుకున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, సీఎం కేసీఆర్ ప్రచారాలు నిర్వహించారు. దీంతో ప్రచారం స్థారస్థాయికి చేరుకొంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంతోపాటు పలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చారు. పోలింగ్ కేంద్రాల వారిగా ఇంటింటా ప్రచారం సైతం నిర్వహించారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా భారీ ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో ఎక్కుడ చూసినా సీనియర్ సిటీజన్ల నుంచి ప్రతి ఒక్కరూ ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. దీంతో ఓటరు నాడి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పార్టీలు సోషల్ ఇంజినీరింగ్ పకడ్బందీగా చేస్తూ వస్తున్నారు. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు సోషల్ మెసేజ్మేంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సమయం తరిగిపోవడంతో అభ్యర్థులు, నాయకులు ప్రతి నిమిషాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.