ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాజీ సీఎం భార్య

నవతెలంగాణ – హైదరాబాద్: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గండీ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె జేఎంఎం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ మేరకు జేఎంఎం పార్టీ అమెను తమ అభ్యర్థిగా ప్రకటించింది. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇటీవల రాజీనామా చేయడంతో గండీ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. దాంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నిక కోసం జేఎంఎం అభ్యర్థిగా కల్పనా సోరెన్‌ పేరు ఖరారయ్యింది. భూకుంభకోణం కేసులో ఆమె భర్త హేమంత్‌ సోరెన్‌ జైలుకు వెళ్లడంతో పార్టీకి అన్నీ తానై ఆమె వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా బరిలో దిగి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. కల్పనా సోరెన్‌ ఒడిశాలో పుట్టి పెరిగారు. మయూర్‌భంజ్‌ జిల్లాలో ఆమె పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్‌, ఎంబీఏ పూర్తిచేశారు. కాగా గండీ అసెంబ్లీ స్థానానికి ఐదో విడత లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 20న పోలింగ్‌ జరగనుంది.

Spread the love