ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్ళను ఆ దేవుడు కూడా క్షమించడు: రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : ‘దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్‌లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్లలాగా (మీరు)… రాముడినో, హనుమంతుడినో వాడుకుంటున్నారంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీవాళ్లకు చెబుతున్నా’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి రాముడు, హనుమాన్ జయంతి, బతుకమ్మ, బోనాల పండుగలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. మన తాతలు, తండ్రులు ఈ పండుగలు చేయలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ వయస్సు మీద పడిందని… ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ప్రజలు ఆయనను బండకేసి కొట్టారని, తిరస్కరించారని… ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదన్నారు. మెదక్ నుంచి నీలం మధును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మధును గెలిపిస్తే మెదక్ ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. ఈ పదేళ్లలో మోడీ మనకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని ఎద్దేవా చేశారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఘన విజయం సాధించి… ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. బీహెచ్ఈఎల్, ఇతర పరిశ్రమలు వచ్చినట్లు తెలిపారు. గత పాతికేళ్లుగా మెదక్ లోక్ సభ స్థానం బీఆర్ఎస్, బీజేపీ చేతిలో నలిగిపోయిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మల్లన్న సాగర్ కోసం భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, వెంకట్రామిరెడ్డిలు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కరీంనగర్ నుంచి వెంకట్రామిరెడ్డిని తీసుకువచ్చి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్నారు.

Spread the love