– క్రీడా స్థలాల్లో భద్రత గాలికి
– కీచక బ్రిజ్‌భూషణ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి
– ఐద్వా సెమినార్‌లో జగ్మతి సంగ్వాన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయటం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ఉపాధ్యక్షులు జగ్మతి సంగ్వాన్‌్ ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘కీచక బ్రిజ్‌భూషణ్ అరెస్టు ఎప్పుడు? రెజ్లర్ల న్యాయపోరాటానికి ఐద్వా మద్దతు’ అనే అంశంపై సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్మతి మాట్లాడుతూ మహిళా మల్ల యోధుల సమస్య దేశ ప్రజల ముందు ఒక ఎజండాగా నిలిచిందని చెప్పారు. దేశానికి గౌరవాన్ని, ప్రతిష్టను తీసుకొచ్చిన రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీని అరెస్టు చేయటానికి బీజేపీ ససేమిరా అంటున్నదంటే..మహిళల గౌరవం పట్ల, దేశ ప్రతిష్టపట్ల ఆ పార్టీకి ఎలాంటి విశ్వాసం ఉందో అర్థమవుతుందన్నారు. రెజ్లర్లు లేవనెత్తిన అంశాలు..వారివే కావనీ, దేశంలోని మహిళలందరి భద్రతకు సంబంధించిందని చెప్పారు. అందుకే ఇది దేశ ప్రజల ఎజెండాగా మారిందని వివరించారు. ప్రధాని మోడీతో పాటు, హోం, క్రీడా శాఖల మంత్రులు కనీసం నోరు కూడా విప్పలేదంటే.. వీరు ఎవరి పక్షమో చెప్పకనే చెప్పారన్నారు. రెజ్లర్లు విధిలేని పరిస్థితుల్లో వారు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళనకు దిగారని తెలిపారు. నిందితుడిపై 40కిపైగా క్రిమినల్ కేసులున్నాయని చెప్పారు. అయినా అతన్ని వెనుకేసుకు వస్తున్నారంటే..ఈ అంశాలను ఓట్లు, సీట్లు, రాజకీయ అంశాలతో ముడి పెట్టి చూస్తున్నారనే విషయం అర్థమవుతుందన్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని గుర్తుచేశారు. మహిళల భద్రతను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఈ సందర్భంగా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా జాతీయ జెండా చేబూని నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై పోలీసుల దాష్టీకాన్ని ప్రదర్శించారని చెప్పారు. అయినా వారు జాతీయ జెండాను కిందపడకుండా సమున్నతంగా నిలిపారని గుర్తుచేశారు. కపిల్‌దేవ్,సానియామీర్జా, చోప్రా, నికిత్‌జరీన్, విరాట్‌కోహ్లి తదితర క్రీడాకారులు ఈ సంఘటనపట్ల ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సిమ్లాలో రెజ్లర్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుకు ఐక్యమవుతున్న విద్యార్థి, యువజన, మహిళా,ప్రజాతంత్ర, స్వచ్చంద సంస్థల కార్యక్రమాన్ని పోలీసులు విద్వంసం చేశారని చెప్పారు. మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహిళల భద్రత పట్ల ప్రభుత్వాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
చట్టం ఎవరికైనా ఒకటేననీ, ఎంపీలకు ఒక రకంగా, సామాన్యులకు మరో రకంగా పనిచేయటమేంటని ప్రశ్నించారు. వెంటనే బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు టి జ్యోతి మాట్లాడుతూ మహిళా మల్ల యోధులు దేశ ప్రతిష్టను పెంచారని గుర్తుచేశారు. ఫొక్సో చట్టాన్ని అమలు చేయటంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. ఉపాధ్యక్షులు బి హైమావతి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల తరగతుల పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వం పతనం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు ఆశాలత, మాచర్ల భారతి పాల్గొన్నారు.