లక్ష కోట్ల ఆస్తి రూ.7 వేల కోట్లకే..

– ఢిల్లీ లిక్కర్‌ స్కాం కంటే టోల్‌ స్కామే పెద్దది
– కన్సెషన్‌ అగ్రిమెంట్‌ నిజమా? కాదా? తేల్చాలి
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే తాను ముక్కలు
– బీఆర్‌ఎస్‌ విజయం కోసం బీజేపీ తపిస్తుంది : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కంటే ఓఆర్‌ఆర్‌ టోల్‌ స్కామ్‌ వెయ్యి రెట్లు పెద్దదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ‘రూ. లక్ష కోట్ల విలువైన ఔటర్‌ రింగ్‌ రోడ్డును కేవలం రూ.7వేల కోట్లకు తెగనమ్మారు. కేటీఆర్‌ ధన దాహానికి ఓఆర్‌ఆర్‌ బలైంది. ఆ టెండర్ల వ్యవహరంలో కల్వకుంట్ల కుటుంబం దారి దోపిడీకి పాల్పడింది. అందులో కేసీఆర్‌, కేటీఆర్‌ లబ్దిదారులైతే… సూత్రాధారులు, పాత్రధారులు సోమేష్‌ కుమార్‌, అరవింద్‌ కుమార్‌’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులు అనిల్‌యాదవ్‌, సంపత్‌కుమార్‌, నదీమ్‌ అహ్మద్‌, వేణుగోపాల్‌, జగదీశ్వర్‌తో కలిసి రేవంత్‌ విలేకర్లతో మాట్లాడారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌ స్కామ్‌పై కేంద్రం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు. టెండర్‌ దక్కించుకున్న సంస్థ టెండర్‌ మొత్తం విలువలో 10శాతాన్ని 30 రోజుల్లోగా, మిగతా 90 శాతాన్ని 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి నిబంధనలు లేవంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుకాయించారని ఎద్దేవా చేశారు. డబ్బు చెల్లింపులకు సంబంధించి కన్సెషన్‌ అగ్రిమెంట్‌లో స్పష్టంగా ఈ నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘అగ్రిమెంట్‌లోని 20, 21 పేజీలో మేం చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నేను చెప్పింది 10 శాతమే కానీ వాస్తవంగా 30 రోజు ల్లో 25 శాతం టెండర్‌ పొందిన సంస్థ చెల్లించాలి. మిగతా 75 శాతాన్ని 120 రోజుల్లో చెల్లించాలి.ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చి ఉంటే, ఆ మార్చిన నిబంధనలు ఏమిటో బయటపెట్టాలి. నేను బయట పెట్టిన కన్సె షన్‌ అగ్రిమెంట్‌ నిజమా? కాదా? చెప్పాల్సిన బాధ్యత అరవింద్‌ కుమార్‌, సోమేశ్‌ కుమార్‌పై ఉంది’ అని ఈ సందర్భంగా రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ టెండర్‌ నిబంధనలు మారిస్తే ఇది కూడా ఢిల్లీ లిక్కర్‌ స్కాం తరహా కుంభకోణం అవుతుందన్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపొందించినప్పుడు మొదట్లో నిబంధనలు కఠినంగా ఉంటే, బీఆర్‌ఎస్‌ నాయకు రాలు కవిత వెళ్లి లాబీయింగ్‌ చేసి సౌత్‌ గ్రూపునకు అనుకూలంగా నిబంధ నలు మార్చే లా చేశారని ఆరోపించారు. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టు లను రూ. 7 వేల కోట్లకే అప్పగించారని విమర్శించారు. దీని మీద బీజేపీ ప్రభు త్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంత బహిరం గంగా దోపిడీ జరుగుతుంటే, బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈడీ,సీబీఐ దాడులు ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌ గూడుపుఠానీ
లక్షల కోట్ల ప్రాజెక్టును కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని రేవంత్‌ విమర్శించారు. కేంద్ర మంత్రి హౌదాలో ఉండి విచారణకు ఎందుకు ఆదేశం ఇవ్వడం లేదని కిషన్‌ రెడ్డిని నిలదీశారు. ఈ వ్యవహారం వెనుక బీజేపీ, బీఆర్‌ఎస్‌ గూడుపుఠానీ ఏమిటి? అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఓఆర్‌ఆర్‌ టెండర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేశారనీ, ఆ ఫిర్యా దును బండి సంజరు, కిషన్‌రెడ్డి నమ్ముతున్నారా? లేదా? స్పష్టం చేయా లని డిమాండ్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ వ్యవహారాన్ని అంత తొందరగా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నా రు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకే తాను ముక్కలని విమర్శించారు. ‘తెలంగాణలో బీజేపీది మూడో స్థానమే అని వాళ్ల జాతీయ నాయకులే చెబు తున్నారు. గట్టి నాయకులు 40 మంది లేకుండా ఎలా గెలుస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌ను గెలవకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యం. ఇప్పటికై నా ప్రజలు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బీఆర్‌ఎస్‌ ఓడిం చేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే’ అని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

Spread the love