కోర్టులో పోరాటం కొనసాగిస్తాం

–  మాకు న్యాయం జరిగేవరకు ఆందోళన ఆగదు : అగ్రశ్రేణి రెజ్లర్లు
న్యూఢిల్లీ : డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసుపై కోర్టులో తమ పోరాటం కొనసాగిస్తామని ఆందోళన చేసిన రెజ్లర్లు ప్రకటించారు. రెజ్లింగ్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై ఛార్జీషీటు దాఖలు హామీని నెరవేర్చిందని రెజ్లర్లు వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, భజరంగ్‌ పునియా తెలిపారు. ఈ మేరకు సోమవారం ముగ్గురు రెజ్లర్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. రెజ్లర్లతో ప్రభుత్వం చర్చలు, జూన్‌ 15న రెజ్లింగ్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌పై కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాక్షి మాలిక్‌ తెలిపారు. ఈ కేసులో తమకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగుతుందని, అయితే అది వీధుల్లోకాదు.. కోర్టులో అని మహిళా రెజ్లర్లు తెలిపారు. రెజ్లింగ్‌ అసోసియేషన్‌లో సంస్కరణలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌ కొన్ని రోజులు సోషల్‌ మీడియా నుంచి విరామం తీసుకున్నట్టు ట్వీట్‌ చేశారు. మరోవైపు రెజ్లర్లపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ డబ్ల్యుఎఫ్‌ఐ అడ్మినిస్ట్రేషన్‌ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. నేరం రుజువైతే బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే అసోం హైకోర్టులో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికలపై ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ), క్రీడా మంత్రిత్వ శాఖ, డబ్ల్యూఎఫ్‌ఐకి వ్యతిరేకంగా అస్సాం రెజ్లింగ్‌ అసోసియేషన్‌ (ఎడబ్ల్యుఎ) దాఖలు చేసిన పిటిషన్‌పై అస్సాం హైకోర్టు స్టే విధించింది.

Spread the love