డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శిక్షార్హుడే

– బాధితులను లైంగికంగా వెంటబడి వేధించినట్టు ఆధారాలు: ఛార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసుల వెల్లడి
న్యూఢిల్లీ : రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు బలం చేకూరుతున్నది. ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో పేర్కొన్నారు. బాధితులను లైంగికంగా వెంటబడి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దీంతో బ్రిజ్‌ భూషణ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదయ్యాయి. బాధితులను నేరపూరితంగా బెదిరించడం, మహిళల గౌరవ, మర్యాదలను భంగపరచడం, లైంగిక వేధింపులు, వెంటాడటం వంటి నేరాలకు ఆయన పాల్పడినట్టు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ కేసులను నమోదు చేసి.. దర్యాప్తు చేశారు. ఓ బాధితురాలిపై సింగ్‌ వేధింపులు పదే పదే కొనసాగినట్టు పేర్కొన్నారు.
రెండు కేసుల్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులు రుజువైతే ఆయనకు ఐదేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 108 మంది సాక్షులను ప్రశ్నించినట్టు, వీరిలో 15 మంది ఈ ఆరోపణలను సమర్థించినట్టు ఢిల్లీ పోలీసులు ఈ ఛార్జిషీటులో పేర్కొన్నారు. ఈ 15 మందిలో రెజ్లర్లు, కోచ్‌లు, రిఫరీలు ఉన్నారని తెలిపారు.
ఇదిలావుండగా, ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు సింగ్‌కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న హాజరుకావాలని ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది. దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, బజ్రంగ్‌ పూనియా నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరిగిన అనంతరం ప్రభుత్వం దిగి వచ్చింది. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రెజ్లర్లతో చర్చలు జరిపి, జూన్‌ 15నాటికి సింగ్‌పై ఛార్జిషీట్‌ దాఖలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు జోక్యంతో కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతున్నది.

Spread the love