బ్రిజ్‌ భూషణ్‌కు సమన్లు

– రెజ్లర్ల ఆరోపణలు విచారించదగినవే
– విచారణ జరిపేందుకు తగిన ఆధారాలున్నాయి
– ఈనెల 18న విచారణకు హాజరుకావాలి
– బీజేపీ ఎంపీపై దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ పై నమోదైన కేసు విచారించదగినదేనని ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో 18న మధ్యాహ్నం 2:30 గంటలకు కోర్టు ముందు విచారణకు హాజరుకావాలని ఆయనకు అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ హర్జీత్‌ సింగ్‌ జస్పాల్‌ సమన్లు జారీ చేశారు. ఆయనతో పాటు సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్‌ సెక్రెటరీ వినోద్‌ తోమర్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి. నిందితులపై విచారణ జరిపేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ పోలీసులు ఆయనపై జూన్‌ 15న దాఖలు చేసిన చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
బ్రిజ్‌ భూషణ్‌పై ఓ మైనర్‌ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ కేసులో దర్యాప్తు ఆలస్యమవుతుండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి వచ్చింది. సుప్రీం కోర్టు జోక్యంతో ఆయనపై ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లను, 10 ఫిర్యాదులను నమోదు చేశారు. మహిళా రెజ్లర్లను లైంగిక వాంఛలు తీర్చాలని ఆయన కోరినట్టు ఆరోపించారు. మహిళా రెజ్లర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు, వారి ఛాతీలను అసభ్యకరంగా ముట్టుకున్నట్లు, వారిని వెంటపడి తరిమినట్టు ఆరోపించారు. తన టీ-షర్ట్‌ను లాగి, తమ ఛాతీపై ఆయన చేయి పెట్టారని మరో రెజ్లర్‌ ఆరోపించారు. తమను ఆయనవైపు బలంగా లాక్కున్నారని చెప్పారు. శ్వాస తీసుకునే విధానాన్ని పరిశీలిస్తానంటూ తన ఛాతీ, పొట్ట భాగాల్లో ఆయన చేతులు వేశారని మరో రెజ్లర్‌ ఆరోపించారు. మరో రెజ్లర్‌ను ఆయన కౌగిలించుకుని, ముడుపులు ఇస్తానని చెప్పారన్న దానిపై ఆరోపణలు నమోదయ్యాయి. తన భుజాలను గట్టిగా నొక్కారని మరో రెజ్లర్‌ ఆరోపించారు.బ్రిజ్‌ భూషణ్‌ తనను గట్టిగా పట్టుకున్నారని మైనర్‌ రెజ్లర్‌ ఆరోపించారు. ఫొటోలు తీసుకోవాలనే నెపంతో ఆయన ఈ దురాగతానికి ఒడిగట్టారని చెప్పారు. ఇటువంటి పనులు చేయవద్దని తాను ఆయనకు చెప్పానని తెలిపారు. అయితే ఈ కేసును మైనర్‌ రెజ్లర్‌ ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టుపై స్పందించాలని ఢిల్లీ కోర్టు ఈ మైనర్‌ను, ఆమె తండ్రిని ఇటీవల ఆదేశించింది.
బ్రిజ్‌ భూషణ్‌పై ఏప్రిల్‌ 21న ఫిర్యాదులను నమోదు చేశామని, ఏప్రిల్‌ 28న ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆరుగురు రెజ్లర్లు చేసిన ఆరోపణలతో ఓ ఎఫ్‌ఐఆర్‌ను, ఓ మైనర్‌ అథ్లెట్‌ తండ్రి చేసిన ఫిర్యాదుపై మరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశామన్నారు. ఈ ఆరోపణలు రుజువైతే ఆయనకు గరిష్ఠంగా మూడేండ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
బ్రిజ్‌ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఏప్రిల్‌ 23 నుంచి మే 28 వరకు ఆందోళన చేపట్టారు. వీరికి రైతు, మహిళ, విద్యార్థి, యువజన సంఘాలతో సహా వివిధ రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆహ్వానం మేరకు రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌ జూన్‌ 7న ఆయన నివాసానికి వెళ్లారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఫిర్యాదుల గురించి చర్చించారు. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాతో మాట్లాడుతూ జూన్‌ 15నాటికి బ్రిజ్‌ భూషణ్‌పై ఛార్జిషీటు దాఖలు చేస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎన్నికలు జూన్‌ 30నాటికి పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిపారు. రెజ్లర్లపై నమోదైన పోలీసు కేసుల ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలిపారు. జూన్‌ 15 వరకు నిరసనలను తాత్కాలికంగా నిలిపేసేందుకు రెజ్లర్లు అంగీకరించారు. అయితే పూనియా విలేకర్లతో మాట్లాడుతూ, జూన్‌ 15 నాటికి బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోకపోతే తాము నిరసనలను పునరుద్ధరిస్తామని చెప్పారు. రెజ్లర్లు జూన్‌ 4న రాత్రి కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. బ్రిజ్‌ భూషణ్‌పై సాధ్యమైనంత త్వరగా చార్జిషీటును దాఖలు చేయాలని కోరారు.

Spread the love