రాహుల్‌కు ఎదురుదెబ్బ

– మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై
– పిటిషన్‌ను తోసిపుచ్చిన గుజరాత్‌ హైకోర్టు
– సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న కాంగ్రెస్‌
– యుద్ధం అయిపోలేదు :ప్రియాంక
అహ్మదాబాద్‌ : ‘మోడీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనాయ కుడు రాహుల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. క్రిమినల్‌ పరువునష్టం కేసులో తనను దోషిగా ప్రకటిం చటాన్ని నిలిపివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు తోసిపుచ్చింది. రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా ఇప్పటికే పది కేసులను ఎదుర్కొంటున్నారని పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ ప్రచ్ఛక్‌ తెలిపారు. రాహుల్‌ను దోషిగా తేల్చిన దిగువ న్యాయస్థానం ఆదేశాన్ని సమర్థించారు. దోషిగా ప్రకటించటాన్ని నిలిపివేయటానికి సహేతుక కారణమేదీ లేదని గుజరాత్‌ హైకోర్టు వివరించింది. గుజరాత్‌ హైకోర్టు ఒకవేళ స్టే విధిస్తే రాహుల్‌ ఎంపీగా కొనసాగటానికి మార్గం సుగమం అయ్యేది.
బీజేపీ గుజరాత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ దాఖలు చేసిన పిటిషన్‌పై 2019కి సంబంధించిన కేసులో సూరత్‌లోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు కోర్టు మార్చి 23న రాహుల్‌ను దోషిగా తేలుస్తూ రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే.
అహంకార మోడీ సర్కార్‌పై రాహుల్‌ అలుపెరగని పోరు : ప్రియాంక గాంధీ
ప్రజల ప్రయోజనాల కోసం ‘అహంకార పాలన’కు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ పోరాడుతున్నారని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఈ ప్రభుత్వం రాహుల్‌ లేవనెత్తుతున్న ప్రశ్నలను అణచివేయడానికి అన్ని ఉపాయాలనూ వాడుకుంటున్నదని మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్‌ పరువునష్టం కేసులో రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు తిరస్కరించిన అనంతరం ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో హిందీలో ఒక సుదీర్ఘ పోస్టును ఆమె రాసుకొచ్చారు. ఒక పద్యాన్ని ట్వీట్‌లో కోట్‌ చేశారు. ”యుద్ధం ఇంకా అయిపోలేదు” అని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంపై మాటల దాడి చేశారు. ద్రవ్యోల్బణం, ఉద్యోగం, రైతుల సంక్షేమం, మహిళల హక్కులు, కార్మికుల గౌరవం వంటి వాటి గురించి ప్రశ్నించకూడదని ఈ అహంకార ప్రభుత్వం అనుకుంటుందని ప్రియాంక ఆరోపించారు. సత్యం, సత్యాగ్రహం, ప్రజల శక్తి ముందు అహంకార పాలన నిలవదనీ, వాస్తవంపై అవాస్తవాల ముసుగు కొనసాగదని పేర్కొన్నారు. ”నిజం గెలుస్తుంది. ప్రజా గొంతు విజయం సాధిస్తుంది” అని ఆమె వివరించారు. కాగా, గుజరాత్‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్‌ తెలిపింది.

Spread the love