యూసీసీపై 46 లక్షల స్పందనలు

న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై ప్రజల నుండి అభిప్రాయాలు కోరుతూ 22వ లా కమిషన్‌ చేసిన జారీ చేసిన ప్రకటనకు మంచి స్పందన లభిస్తోంది. అభిప్రాయాలు తెలియజేసేం దుకు మరో రెండు రోజులలో గడువు ముగియనుండగా సోమవారం సాయంత్రా నికి 46 లక్షల మంది స్పందించారు. రాబోయే రోజులలో కొన్ని సంస్థలను, కొందరు వ్యక్తులను వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా లా కమిషన్‌ కోరే అవకాశం ఉంది. దీనిపై కొందరికి ఇప్పటికే లేఖలు పంపారు. రాజకీయంగా సున్నితమైన యూసీసీపై లా కమిషన్‌ గత నెల 14న సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ప్రజల నుండి, గుర్తింపు పొందిన మత సంస్థల నుండి అభిప్రాయాలు కోరింది. 21వ లా కమిషన్‌ కూడా రెండు సందర్భాలలో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. దానికి అనుగుణంగా 2018 ఆగస్టులో ‘కుటుంబ చట్టానికి సంస్కరణలు’ పేరిట సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. అయితే ఈ పత్రాన్ని విడుదల చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన దృష్ట్యా యూసీసీ ప్రాధాన్యత, ఔచిత్యంతో పాటు వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని తాజాగా మరోసారి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నామని 22వ లా కమిషన్‌ బహిరంగ నోటీసు ద్వారా తెలియజేసింది. పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన సందర్భంలో కూడా తన నిర్ణయాన్ని లా కమిషన్‌ సమర్ధించుకుంది.

Spread the love