పార్లమెంట్‌ భవనంలో చారిత్రక రాజదండం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28న ప్రారంభించే పార్లమెంట్‌ నూతన భవనంలో బంగారపు చారిత్రక రాజదండం కూడా మనకు కన్పిస్తుంది. దీనిని స్పీకర్‌ స్థానం సమీపంలో ఏర్పాటు చేస్తారు. బ్రిటిష్‌ వారి నుండి అధికార మార్పిడికి సంకేతంగా ఈ రాజదండాన్ని నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు 1947 ఆగస్ట్‌ 14వ తేదీ అర్థరాత్రి సమయంలో చివరి వైస్రారు లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ అందజేశారు. దీని చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన ప్రధాని మోడీ దానిని నూతన పార్లమెంట్‌ భవనంలో ఉంచుతారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బుధవారం తెలిపారు. దీని ప్రాధాన్యత చాలా మంది భారతీయులకు తెలియదని ఆయన చెప్పారు. చోళుల కాలంలో ఇలాంటి రాజదండాలు వాడేవారని వివరించారు. ఇది అధికారానికి చిహ్నమని, అధికారం ఒకరి నుండి మరొకరికి మారేటప్పుడు దీనిని అందజేసేవారని తెలిపారు. ఈ రాజదండం ప్రస్తుతం అలహాబాద్‌ మ్యూజియంలో ఉంది.
రాజదండం కథా కమామిషు
భారత స్వాతంత్య్రానికి గుర్తుగా ఏదైనా చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నెహ్రూకు మౌంట్‌ బాటన్‌ సూచించారు. దీనిపై అప్పటి చిట్టచివరి గవర్నర్‌ జనరల్‌ సీ రాజగోపాలాచారిని నెహ్రూ సంప్రదించగా రాజదండం గురించి చెప్పారు. రాజదండాన్ని స్వీకరించాలన్న సూచనకు నెహ్రూ, మౌంట్‌ బాటన్‌ అంగీకరించారు. రాజదండం తయారీ కోసం రాజగోపాలాచారి మద్రాస్‌ వెళ్ళి మఠాధిపతులను సంప్రదించారు.
అప్పుడు ఉమ్మిడి బంగారు చెట్టి అనే ఆభరణాల తయారీదారు దీనిని ఐదు అడుగుల పొడవుతో తయారు చేశారు. దాని పైభాగంలో న్యాయానికి ప్రతీకగా నందిని చెక్కారు. అనంతరం రాజదండాన్ని మఠాధిపతులు గంగాజలంతో శుద్ధి చేసి ఊరేగింపుగా నెహ్రూ వద్దకు తీసికెళ్లారు. 1947 ఆగస్ట్‌ 14వ తేదీ అర్థరాత్రి దానిని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, ఇతర నేతల సమక్షంలో నెహ్రూ స్వీకరించారు.

Spread the love