– నాలుగేండ్లలో 1.3 కోట్లకు తగ్గిన వైనం
– కేంద్ర గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత నాలుగేండ్లలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య పెరగగా, వాస్తవానికి ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య తగ్గింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే దీనిని వెల్లడిస్తున్నాయి. గతనెల 24న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నాలుగేండ్లలో ఆదాయపు పన్నును దాఖలు చేసిన వ్యక్తుల సంఖ్య, జీరో లయబిలిటీ ఉన్న రిటర్న్‌ల సంఖ్యపై డేటాను లోక్‌సభ ముందు సమర్పించారు.కేంద్ర గణాంకాల ప్రకారం.. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసిన వ్యక్తుల సంఖ్య 2019-2020లో 6.47 కోట్ల మంది నుంచి 2022-23 నాటికి 7.40 కోట్లకు పెరిగింది. అయితే, 2020-21లో ఆదాయపు పన్ను రిటర్నులు జీరో లయబిలిటీ ఉన్న వ్యక్తుల సంఖ్య బాగా పెరిగింది. తర్వాతి సంవత్సరాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగింది. ఇది 2019-20లో 2.90 కోట్ల మందికి పైగా ఉంటే, 2022-23లో 5.15 కోట్ల మందికి పైగా చేరారు. 2019-20లో 3.57 కోట్ల మంది ఆదాయపు పన్ను రూపంలో డబ్బు చెల్లించగా, 2022-23 నాటికి ఆ సంఖ్య 2.23 కోట్లకు తగ్గింది
.కోవిడ్ -19 మహమ్మారి ఆదాయాన్ని తగ్గించిందనీ, వ్యాపారాలు మందగించాయనీ, దీని కారణంగా 2020-21 నుంచి జీరో పన్ను దాఖలు సంఖ్య పెరగవచ్చని చెన్నైకి చెందిన పన్ను నిపుణుడు విక్రమ్ ఆర్ చెప్పారు. గ్రాంట్ థార్న్‌టన్ భారత్‌లో భాగస్వామి అయిన అఖిల్ చందనా మాట్లాడుతూ.. పన్ను పరిధిలోకి రాని మొదటిసారి పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం వల్ల ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తుల సంఖ్య తగ్గిందని అన్నారు.