నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-3 దరఖాస్తుల్లో సవరణలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అవకాశం కల్పించింది. ఈనెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను సవరణ చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక అభ్యర్థి ఒకసారి మాత్రమే సవరణ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ తొలి గ్రూప్-3 ద్వారా 1,388 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది డిసెంబర్ 30న నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.