నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్వాతంత్య్ర దినోత్సవం జెండా ఆవిష్కరణల అనంతరం రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల సమ్మెలోకి వెళ్లనున్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(టీయుఎంహెచ్ ఇయూ – సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సీఐటీయూ సిటీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి ఏఎన్‌ఎంల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియుద్దీన్ అధ్యక్షత వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.యాద నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.బలరాం, రాష్ట్ర కోశాధికారి కవిత, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీయుఎంహెచ్‌ఇయూ గౌరవాధ్యక్షులు భూపాల్ ప్రసంగించారు.
నోటిఫికేషన్ రద్దు చేయాలి
భూపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము 1520 ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుచేసి ఖాళీ పోస్టుల్లో కాంట్రాక్ట్ వారిని సీనియార్టీ ప్రకారంగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు జులై 31న సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల మంది కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలందరూ ఆగస్టు 15 జండా ఆవిష్కరణల అనంతరం సమ్మెలోకి వెళుతున్నట్టుగా ప్రకటించి సమ్మెను ప్రారంభించాలని కోరారు.
ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తున్నదని భూపాల్ విమర్శించారు. ఇటీవల కాలంలో మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలు మేల్ హెల్త్ అసిస్టెంట్లను నేరుగా రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు పరీక్ష విధానం రద్దుచేసి యధావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల నాయకులు కిరణ్మయి, సుగుణ, తదితరులు ప్రసంగించారు.