పోక్సో కేసులపై ఒరిస్సా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ-హైదరాబాద్ : లైంగిక వేధింపుల నుంచి చిన్న పిల్లలను కాపాడే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో).. 2012 లో తీసుకొచ్చిన ఈ చట్టం దుర్వినియోగానికి గురవుతోందంటూ ఒరిస్సా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం కింద పెడుతున్న కేసుల్లో సగం వరకూ ప్రతీకార, కక్ష సాధింపు చర్యలో భాగమేనని వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఈ చట్టం కింద కేసు నమోదైతే నిందితులకు బెయిల్ కూడా ఇవ్వకుండా నిబంధనలు అడ్డుకుంటాయని చెప్పింది. నేరం రుజువైతే కఠిన శిక్ష పడుతుందని తెలిపింది. లైంగిక వేధింపుల నుంచి మైనర్లను రక్షించడమే దీని వెనకున్న ప్రధాన ఉద్దేశమని వివరించింది. అదే సమయంలో మైనర్ల మధ్య ఏర్పడే రొమాంటిక్ రిలేషన్ షిప్ ను అడ్డుకుని, వారిని విడదీయడం ఈ చట్టం ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. ఇటీవల నమోదైన పోక్సో కేసులను విచారిస్తూ.. దాదాపు సగం కేసులలో తప్పుడు ఆరోపణలు, కక్ష సాధింపు కోసం పెట్టిన కేసులేనని ఒరిస్సా హైకోర్టు వ్యాఖ్యానించింది. మైనర్ల ప్రేమను, వారి సాన్నిహిత్యాన్ని సహించలేక పేరెంట్స్ ఈ కేసులు పెడుతున్నారని జస్టిస్ సిబో శంకర్ మిశ్రా పేర్కొన్నారు. బాధితుల మైనారిటీ తీరగానే వారు వివాహం చేసుకుని కోర్టును ఆశ్రయిస్తున్నారని, తమపై నమోదైన పోక్సో కేసును కొట్టేయాలంటూ అర్థిస్తున్నారని చెప్పారు. తాజాగా విచారిస్తున్న నాలుగు కేసులను కొట్టివేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదు కేసుల్లోనూ నాలుగు కేసులు వివాహ బంధంతోనే ముగిశాయని చెప్పారు.

Spread the love