మిలిటెంట్ల దాడి..మణిపూర్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపూర్‌లో మిలిటెంట్లు మళ్లీ విరుచుకుపడ్డారు. బష్ణూపూర్‌ జిల్లాలోని నారన్‌సీనా గ్రామం వద్ద ఉన్న ఓ సీఆర్‌పీఎఫ్ స్థావరంపై కొందరు మిలిటెంట్లు ఈ తెల్లవారు జామున అకస్మాత్తుగా దాడికి దిగారు. ఈ క్రమంలో సీఆర్‌పీఎఫ్ విసిరిన ఓ బాంబు పేలడంతో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు చికిత్స అందిస్తున్నారు. 128 బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ సర్కార్, హెడ్ కానిస్టేబుల్ అరున్ శైనీ మిలిటెంట్ల దాడిలో మరణించినట్టు సీఆర్పీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్‌స్పెక్టర్ జాదవ్ దాస్, కానిస్టేబుల్ అప్తాబ్ దాస్ దాడిలో గాయపడ్డట్టు వెల్లడించింది. ‘‘సీఆర్‌పీఎఫ్ క్యాంపే టార్గెట్‌గా మిలిటెంట్లు కొండలపై నుంచి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బాంబులు కూడా విసిరారు. ఇందులో ఒకటి పేలడంతో 128 బెటాలియన్‌ క్యాంపులో పేలింది’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, దాడికి తెగబడ్డ మిలిటెంట్ల ఏరివేతకు పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. గతేడాది ఆగస్టులో మణిపూర్‌లో మేతీ, కూకీ తెగల మధ్య పరస్పర దాడులు ప్రారంభమైన విషయం తెలిసిందే. గ్రామ రక్షణ దళాలుగా తమని తాము పిలుచుకునే ఈ మిలిటెంట్లు స్వీయరక్షణ పేరిట వీళ్లు విచక్షణ రహితంగా హింసకు తెగబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Spread the love