బీజేపీ ప్రభుత్వం వైషమ్యాలు సృష్టిస్తోంది..

– అప్రమత్తంగా లేకపోతే దేశం ఆగమే :ఐలమ్మ ట్రస్ట్‌ కార్యదర్శి హైమావతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో బీజేపీ వైషమ్యాలు సృష్టిస్తున్నదనీ, అప్రమత్తంగా లేకపోతే దేశం అధోగతిపాలవుతుందని ఐలమ్మ ట్రస్ట్‌ కార్యదర్శి బి హైమావతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం వీరనారి ఐలమ్మ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 76వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బాల బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. ’76 వ స్వతంత్ర దినోత్సవం- బాలికల స్థితి’ అనే అంశంపై వ్యాసరచన, లెమన్‌ మరియు చైర్స్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వంద మంది పిల్లలకు పైగా పాల్గొన్నారు.అనంతరం జరిగిన సభలో ట్రస్ట్‌ చైర్మెన్‌ బుగ్గవీటి సరళ, కోశాధికారి కేఎన్‌ ఆశాలత, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, కుటుంబ న్యాయ సలహా కేంద్రం సభ్యులు ఉదయలక్ష్మి, రచయితలు రూపా రుక్మిణి, సమత, ఐద్వా సభ్యులు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ 75ఏండ్ల స్వతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామనీ, అయినా నేటికి అక్షరాస్యత 62, 65 శాతం మధ్యలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.మరో పక్క చదువుకున్న యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయని విమర్శించారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి పేదల కష్టాలు పరిష్కరించకపోగా.. మనువాద సంస్కృతిని పెంచిపోషిస్తున్నదని తెలిపారు. కుల, మత, ప్రాంతాల, తెగల మధ్య వైషమ్యాలు రగిలించి చోద్యం చూస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశభక్తి జపం చేస్తూ..మణిపూర్‌లాంటి మారణహోమాలను సృష్టిస్తున్నదని విమర్శించారు. తిండి లేక, ఉపాధి కరువై యువత డ్రగ్స్‌, తాగుడుకు బానిసలై కొడిగట్టిన దీపాల్లా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై రోజురోజుకు వేదింపులు పెరుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరిస్తే..నేటి బాలబాలికలే రేపటి పౌరులు మారుతారని గుర్తుచేశారు.

Spread the love