కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలి

– ఓబీసీల సమస్యలను పరిష్కరించాలి
– ఓబీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన
– పోస్టర్‌ను అవిష్కరించిన మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం కుల గణనను వెంటనే చేపట్టాలనీ, బీసీల సమస్యలు పరిష్కరించాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆ అసోసియే షన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ క్యాంపు కార్యాలయంలో సంబంధిత పోస్టర్‌ను అవిష్కరించారు. కుల గణన , ఓబిసిల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న హైదరాబాద్‌ లోని రవీంద్ర భారతిలో జాతీయ కన్వేన్షన్‌ను నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలిపారు. బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవటమేంటని ప్రశ్నించారు. తమ సమస్యలపై దేశంలోని వివిధ యూనివర్సిటీలలో ఉన్న ఓబీసీ విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా కుల గణన చేపట్ట వచ్చని వెల్లడించారు. తద్వారా ఆయా వృత్తుల స్థితిగతులు తెలుస్తాయని పేర్కొన్నారు. దీంతో వారి అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించ వచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు జి. కిరణ్‌ కుమార్‌, జాతీయ కోశాధికారి ఓ. కొండల్‌, రాష్ట్ర కోఆర్డినేటర్‌ వెంకట దాస్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్‌ దత్త, వెంకటేష్‌, మదన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love