బర్నింగ్‌ ట్రైన్‌

– ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
– 8 ఏసీ బోగీలు దగ్ధం
– తప్పిన ప్రాణాపాయం

– బొమ్మాయిపల్లి- పగిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రమాదం
– సంఘటనా స్థలాన్ని సందర్శించిన అధికారులు
నవతెలంగాణ- భువనగిరి/భువనగిరిరూరల్‌
బెంగాల్‌ రాష్ట్రం నుంచి నల్లగొండ మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్తున్న ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మాయిపెల్లి – పగిడిపల్లి మధ్యలో రైలు బోగీలలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన లోకో పైలెట్‌ వెంటనే రైలును నిలిపేశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పగిడిపల్లి సమీపంలోకి రాగానే రైలు నుంచి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో కొంతమంది ప్రయాణికులు దూకేశారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులకు కిందకు దించేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌, ట్రాఫిక్‌ డీసీపీ అభిషేక్‌ మహంతి, భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రయాణికులకు భోజన, వసతి ఏర్పాటు చేశారు. మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో వారికి సహాయక చర్యలు చేపట్టారు. మంచినీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, మైనార్టీ సంక్షేమ అధికారి యాదయ్య ప్రిన్సిపాల్‌ను అభినందించారు. కాగా ఘటనా స్థలాన్ని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి సందర్శించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోకో పైలెట్‌ అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు అన్నారు. రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించారు. అనంతరం రైలును సికింద్రాబాద్‌కు తరలించారు. దూమపానం వల్లే షార్ట్‌సర్య్కూట్‌ జరిగిందని ప్రయాణికులు చెప్పారు.
10పది ఫైరింజన్లతో మంటలార్పిన సిబ్బంది
ఉదయం ప్రమాదం జరగ్గానే సమాచారం అందుకున్న కలెక్టర్‌ పమేలా సత్పతి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ఫైర్‌ సిబ్బందికి తెలియజేశారు. ప్రమాదం బొమ్మా యిపల్లి రైల్వే స్టేషన్‌కు దూరంలో జరగడంతో ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఫైర్‌ సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఇతర బోగీలకు మంటలు అంటుకోకుండా రైల్వే సిబ్బంది జాయింట్లను విడదీశారు. 10 ఫైర్‌ ఇంజిన్లతో ఫైర్‌ సిబ్బంది మంటలను ఆపేశారు. 8 ఏసీ బోగీలు కాలిపోయాయి.
సహాయక చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదంపై విచారణ జరుపుతా మన్నారు. మానవ తప్పిదమా.. ప్రమాదవశాత్తు జరిగిందా తేలుస్తామన్నారు.
ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం
ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందంలో 22 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ముఖేష్‌ తెలిపారు. ప్రమాదం పగటివేల జరగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని, అదే రాత్రివేళ అయితే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ గా ఉండేదని అన్నారు. కాలిపోయిన బోగీల్లో ఎవరివైనా విలువైన పత్రా లు, సర్టిఫికెట్లులాంటివి ఉంటే మా పరిధిలో అవి ఇప్పించే ప్రయత్నం చేస్తామని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి బాధితులకు హామీ ఇచ్చారు. ఘటనా స్థలానికి సీపీఐ (ఎం), బీఆర్‌ఎస్‌, సీపీఐ, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు చేరుకొని ప్రయాణికులకు సహాయక చర్యలు చేపట్టారు. వారికి మంచినీరు. ఆహార పదార్థాలు అందించారు.
కామ్రేడ్‌ మాలిని భట్టాచార్య సురక్షితం
ప్రమాదం జరిగిన రైలులోనే ఉన్న ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు మాలిన భట్టాచార్య సురక్షితంగా బయటపడ్డారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్‌ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజ్‌, ఆఫీస్‌ కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేశ్‌ ఆమెను ఘటనా స్థలం నుంచి బీబీనగర్‌లోని గాడి శ్రీనివాస్‌ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం కారులో హైదరాబాద్‌కు పంపించారు.
బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదాలు
– పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలంగాణలోని భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య సికింద్రాబాద్‌ నుంచి వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి బోగీలు కాలిపోవడం బాధాకరమని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికుల ధ్రువపత్రాలు, సామాగ్రి తదితరాలు కాలి బూడిదైపోయాయని పేర్కొన్నారు. ప్రయాణికులు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రైల్వే శాఖ అనుసరిస్తున్న నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణమని విమర్శించారు. రైల్వే లైన్లు, సిగల్‌ వ్యవస్థ, ట్రాకుల ఆధునీకరణ, బోగీల మరమ్మతులు, అవసరమైన సదుపాయాలు చేపట్టకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని వివరించారు. అలాగే రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయక పోవడం కూడా మరొక కారణమని తెలిపారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

Spread the love