హిందూ మతానికి బీజేపీకి సంబంధం లేదు

– మతాల మధ్య చిచ్చు పెట్టడమే ఆ పార్టీ సిద్ధాంతం
– అందుకోసం రాముడిని వాడుకుంటున్నారు ొ భద్రాచలం సీపీఐ(ఎం)దే…
– మరోసారి ఎర్రజెండా ఎగరేస్తాం : జనచైతన్యయాత్రలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
– దుమ్ముగూడం నుంచి ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
హిందూమతానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఓట్లు దండుకోవడం కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ సిద్ధాంతం అనీ, దానికోసం వారు శ్రీరాముడిని వాడుకుంటున్నారని స్పష్టం చేశారు. చాతుర్వర్ణ వ్యవస్థను అమలు చేయాలని ఆపార్టీ సిద్ధాంతకర్త గోల్వాల్కర్‌ పేర్కొన్నారనీ, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం స్థానంలో మనుధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారనీ చెప్పారు. సీపీఎం జనచైతన్యయాత్ర సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి ప్రారంభమై దుమ్ముగూడెం, భద్రాచలం టౌన్‌కు చేరింది. రెండు చోట్లా జరిగిన బహిరంగ సభల్లో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. భద్రాచలం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అవినీతి కుంభకోణాలకు పాల్పడిందంటూ వాటిని ఎత్తిచూపి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ, విదేశీబ్యాంకుల్లోని రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని తెచ్చి, ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని లెక్కలు చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని కాగానే కనీసం నల్లధనం దొంగల పేర్లు కూడా బయటపెట్టలేదనీ, వారితో కుమ్మక్కై దేశాన్ని మరింత దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.రూ.17 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన గౌతం అదానీపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు చేయట్లేదనీ, కేసులు ఎందుకు నమోదు చేయట్లేదని ప్రశ్నించారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై సమాధానం చెప్పాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీస్తుంటే, ప్రధాని మోడీ ఎందుకు ముఖం చాటేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ అసమర్థత, అవినీతి, ప్రజావ్యతిరేక చర్యల్ని ప్రశ్నించే ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసి, రాజ్యాంగ వ్యవస్థల్ని ఉసిగొల్పి, భయభ్రాంతులకు గురిచేసి, బీజేపీలోకి వెళ్లేలా దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి తదితరులపై ఈడీ, ఐటీ దాడులు చేయించి, బెదిరించాలని చూస్తున్నారని చెప్పారు. వారు దోషులైతే శిక్షలు పడాల్సిందేననీ, అదే సందర్భంలో గతంలో ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల్లో దొరికి బీజేపీలో చేరిన నేరస్తుల సంగతి ఏంటని నిలదీశారు. దేశంలోని లౌకిక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనీ, ఈ దేశంలో ముస్లింలు, క్రిష్టియన్లు ఉండరాదనీ, ఉంటే…వారు ద్వితీయశ్రేణి పౌరులుగానే ఉండాలని బీజేపీ నాయకులు బాహటంగానే ప్రకటనలు చేస్తున్నారన్నారు.మోడీని, బీజేపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే దేశద్రోహం కేసులు పెడుతున్నారంటూ వరవరరావు, ప్రొఫెసర్‌ సాయిబాబా పేర్లను ఉదహరించారు. మతోన్మాదంపై ప్రశ్నించినందుకు ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్ధులపై బ్రిటీష్‌కాలంనాటి రాజద్రోహం కేసులు పెట్టారని విమర్శించారు. 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టిన ఘనత బీజేపీదేనని అన్నారు.ఆర్‌ఎస్‌ఎస్‌ నడుపుతున్న రాజకీయపార్టీ బీజేపీ సిద్దాంతపరంగా అత్యంత ప్రమాదరకమైందని హెచ్చరించారు. అంబేద్కర్‌కు దండేసి, దండం పెడతారనీ, అదే సమయంలో ఆయన రాసిన రాజ్యాంగం భారతదేశానికి పనికిరాదనీ, అదో చెత్త అని వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటీకరిస్తే రిజర్వేషన్లు ఉండవనీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విమానాశ్రయాలు, పోర్టులు, బ్యాంకులు, గనులు, ఖనిజాలు, విద్యుత్‌ సహా అన్నింటినీ ప్రయివేటీకరిస్తున్నదని అన్నారు.దీనివల్ల యువతరం ప్రభుత్వరంగంలో లక్షల ఉద్యోగాలు కోల్పోతుందని స్పష్టం చేశారు. మహిళల పట్ల కూడా బీజేపీది వికృత వాదమేననీ, వారిని వంటింటి కుందేళ్లుగా ఉంచేందుకే ప్రయత్నిస్తారని చెప్పారు.
బీజేపీని ఎదుర్కొవడం కోసమే బీఆర్‌ఎస్‌తో…
మతోన్మాద బీజేపీ ప్రమాదాన్ని ఎదుర్కోవడం కోసమే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తున్నామని తమ్మినేని అన్నారు. మునుగోడులో కమ్యూనిస్టుల ఐక్యత వల్లే బీజేపీని ఓడించగలిగామనీ, ఈ విషయాన్ని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం కూడా గుర్తించిందన్నారు. భవిష్యత్‌లో కూడా రాజకీయంగా కలిసినడుస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారనీ, అలాగని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో తామెక్కడా వెనక్కి తగ్గబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలపై కచ్చితంగా పోరాడతామనీ, అదే సమయంలో బీజేపీని రాష్ట్రంలోకి రాకుండా నిలువరించేందుకు బీఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. భద్రాచలంలో మళ్ళీ సీపీఎం జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సీపీఐ(ఎం) , సీపీఐ మధ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై పూర్తి స్పష్టత ఉన్నదనీ, ఎక్కడా రెండు పార్టీలు నేరుగా పోటీపడబోవని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కమ్యూనిస్టుల సత్తా చూపుతామన్నారు. పోడుభూముల సర్వే సక్రమంగా జరగట్లేదనీ, పలుచోట్ల అటవీశాఖ అధికారులు అనేక కొర్రీలు పెడుతున్నారని అన్నారు. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇండ్లులేని పేదలకు కేంద్రప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చి, ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. అవకాశవాదరాజకీయ నాయకులు బీజేపీలోకి మాత్రం వెళ్లొద్దనీ, అలా వెళ్తే వారు ఇక్కడ ప్రజలకు ద్రోహంచేసినవారు అవుతారని హెచ్చరించారు. భద్రాచలంలో శ్రీరాముడిని రక్షించుకోవడం కోసం పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టులేననీ, గుడి అభివృద్ధికి ఇస్తామన్న రూ.100 కోట్లు ఏమయ్యాయని తామే అడుగుతున్నామని చెప్పారు.
గిరిజనులకు అన్యాయం చేస్తున్న మోడీ-మిడియం బాబూరావు
పోడుభూముల పంపిణీపై కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చిందని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు అన్నారు. దానికి కొనసాగింపుగా కేంద్రం గిరిజన చట్టానికి సవరణలు చేసిందనీ, దానివల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రజలకు మోడీ సర్కార్‌పై పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించారనీ, అదే సమయంలో షెడ్యూల్‌ ఐదులో ఉన్న ఈ ప్రాంత ప్రజల సమస్యలపై సమీక్ష చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గిరిజనుల మధ్య మత చిచ్చు పెట్టేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.
కార్పొరేట్లకు అటవీభూములు
-పోతినేని సుదర్శన్‌రావు
అటవీహక్కుల చట్టం స్థానంలో అటవీ పరిరక్షణ చట్టం తెచ్చి బీజేపీ కార్పొరేట్లకు అటవీ భూముల్ని కట్టబెడుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జనచైతన్యయాత్ర ఇంచార్జి పోతినేని సుదర్శనరావు అన్నారు. దీనిలోభాగంగానే ఐటీసీకి రెండువేల ఎకరాలు కట్టబెట్టారని తెలిపారు. మోడీ బినామీగా అదానీ అహ్మదాబాద్‌ నుంచి అమరావతి వరకు విస్తరించారని విమర్శించారు. అంతకుముందు చర్ల నుంచి దుమ్ముగూడెంకు వచ్చిన జనచైతన్యయాత్రకు పర్ణశాల వద్ద ఘన స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా యువకులు యాత్రను అనుసరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామారాజు జిల్లా ఎటపాక మండలంకు చెందిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ అక్కడి నాయకులు తమ్మినేని వీరభద్రంకు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు చర్ల వద్ద అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్‌తో పాటు జనచైతన్య యాత్ర నాయకులు పరిశీలించారు. పంటపొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. భద్రాచలంలో సభాస్థలి వద్ద మాజీ ఎమ్మెల్యేలు కుంజాబొజ్జి, సున్నం రాజయ్య స్మారక స్థూపాలకు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి అన్నవరపు కనకయ్య, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కారం పుల్లయ్య, కే బ్రహ్మచారి, మాజీ డీసీసీబీ చైర్మెన్‌ యలమంచి రవికుమార్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్‌ పాల్గొన్నారు. సీపీఐ భద్రాచలం పట్టణ కమిటీ కార్యదర్శి సునీల్‌ యాత్రకు సంఘీభావం తెలిపారు.

Spread the love