– సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం 1,520 ఎంపీహెచ్‌ఏ(ఎఫ్) పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన 02/2023 నోటిఫికేషన్‌ను రద్దు చేసి కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు వారి సర్వీసును రెగ్యులర్ చేయాలంటూ ఈనెల 15 నుంచి సుమారు ఆరు వేల మంది సమ్మె చేస్తున్నారని తెలిపారు. వైద్య రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం లో, శిశు మరణాలను తగ్గించడంలో, కేసీఆర్ కిట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడం, ఇమ్యూనైజేషన్, కుటుంబ నియంత్రణ వంటి పనుల్లో వారి కృషి ఉందని పేర్కొన్నారు. వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 1520 ఎంపీహెచ్‌ఏ(ఎఫ్) పోస్టులను రాతపరీక్ష ద్వారా భర్తీచేస్తున్నట్టు 2/2023 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. ఇప్పటికే కాంట్రాక్టు సర్వీసెస్‌లో పనిచేస్తున్న వారికి సర్వీస్ వెయిటేజి కింద 20 మార్కులిస్తామనీ, మిగతా మార్కుల కోసం పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారని తెలిపారు. వయో పరిమితి 44 ఏండ్లతోపాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితరులకు ఐదేండ్లు సడలింపు కల్పించారని పేర్కొన్నారు.
దాని ద్వారా 20 ఏండ్లుగా పనిచేస్తున్న 49 ఏండ్లు నిండి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎం, ఈసీ ఏఎన్‌ఎం, అర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్‌ఎం, హెచ్‌ఆర్డీ ఏఎన్‌ఎం, 104 ఏఎన్‌ఎంలుగా ఉన్న సుమారు ఆరు వేల మందిలో అత్యధికులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం ఎంపికై సేవలందిస్తున్నారని తెలిపారు. మళ్లీ వారికి పరీక్ష నిర్వహించడం సరైందికాదని పేర్కొన్నారు. వారిని యథాతథంగా రెగ్యులర్ చేయాలని కోరారు. ఇప్పటికే కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్లను మెరిట్ ఆధారంగా సర్వీసుకు వెయిటేజి ఇచ్చి రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. అలాగే జీఓ నెంబర్ 16 ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి కాంట్రాక్ట్ ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్), ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్, మేల్ హెల్త్ అసిస్టెంట్లను రెగ్యులర్ చేశారని తెలిపారు. వివిధ శాఖల్లో కూడా సుమారు ఐదు వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారని వివరించారు. కావును ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, గత 20 ఏండ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్టు ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్)లను రెగ్యులర్ చేయాలని కోరారు.