విద్వేష ప్రసంగం ఎవరు చేసినా…

Whoever makes hate speech...– మతంతో నిమిత్తం లేకుండా
చర్యలు తీసుకోవాలి : సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : ఏ మతానికి వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేసినా ఒకే రకంగా చూడాల్సిన అవసరముందనీ, నేరస్తుడి మతంతో సంబంధం లేకుండా చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్వేష ప్రసంగాలను ఎదుర్కొనే విషయంలో తెహసీన్‌ పూనేవాలా కేసులో 2018లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ భట్టిలతో కూడిన బెంచ్‌ పేర్కొంది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లను శుక్రవారం బెంచ్‌ విచారిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ”ఏ పక్షం వారు విద్వేష వ్యాఖ్యలు చేసినా వాటిని ఒకే తీరున చూడాలి. ఈ విషయంలో మేం చాలా స్పష్టంగా వున్నాం. విద్వేష ప్రసంగాలకు పాల్పడిన వారెవరైనా వారిపట్ల చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందే. ఇప్పటికే మా అభిప్రాయాన్ని మేం వెల్లడించాం. మళ్లీ పునరావృతం చేయాల్సిన అవసరం వుండదు’ అని బెంచ్‌ పేర్కొంది. కేరళలో జులైలో ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ యువజన విభాగం ర్యాలీ సందర్భంగా ‘హిందువులను చంపండి’ అంటూ నినాదాలు చేశారని ఒక పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దానిపై కోర్టు స్పందిస్తూ, మతంతో సంబంధం లేకుండా విద్వేష ప్రసంగం ఎవరు చేసినా ఒకటేనని, దాన్ని సహించరాదని స్పష్టం చేసింది. నుహ్ లో ఇటీవల అల్లర్ల సందర్భంగా ముస్లింలపై చేసిన వ్యాఖ్యలను షహీన్‌ అబ్దుల్లా సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో తాజాగా శుక్రవారం కోర్టు విద్వేష ప్రసంగాలపై దాఖలైన పిటిషన్లను విచారించింది. కేరళలో ఐయుఎంఎల్‌ ర్యాలీ సందర్భంగా రెచ్చగొట్టే నినాదాలు చేసిన 300 మందిపై ఆ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు. ఐయుఎంఎల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమిలో భాగం కావడం గమనార్హం.

Spread the love