మణిపూర్‌ హృదయ విదారకం

Manipur is heartbreak– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
– గవర్నర్‌ అనుసూయ ఉయికేతో బృందం భేటీ
– పరిస్థితులు మెరుగుపరిచేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ : మణిపూర్‌ ప్రజల బాధలు హృదయ విదారకంగా ఉన్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ‘డబుల్‌ ఇంజన్‌’ ప్రభుత్వం తీరు అధ్వాన్నంగా ఉందని తెలిపారు. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం మూడు రోజుల మణిపూర్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ఇంఫాల్‌ చేరుకున్న బృంద సభ్యులు సహాయ శిబిరాలను సందర్శించారు. మొయిరాంగ్‌లో ఒక సహాయ శిబిరం, చురచంద్‌పూర్‌లో రెండు సహాయ శిబిరాలను నేతలు సందర్శించారు. ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్‌ అనుసూయ ఉయికేను వారు కలిశారు. దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. సహాయక శిబిరాల్లో ఉన్న భయానక పరిస్థితులను చక్కదిద్దేలా జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా సీతారాం ఏచూరికి గవర్నర్‌ హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి, అస్సాం రాష్ట్ర కార్యదర్శి సుప్రకాష్‌ తాలూక్‌ధర్‌, కేంద్ర కమిటీ సభ్యురాలు డెబ్లీనా హెంబ్రామ్‌, మణిపూర్‌ రాష్ట్ర కార్యదర్శి క్షత్రిమయుమ్‌ శాంత తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులతో కూడా సీపీఐ(ఎం) నేతలు సమాలోచనలు జరిపారు. మణిపూర్‌ ప్రజలకు బీజేపీ ద్రోహం చేసిందని వారు తెలిపారు. సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం
జరిగింది. సీతారాం ఏచూరి, క్షత్రిమయుకు శాంత, మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్‌ ఇబోబీ సింగ్‌, పీసీసీ అధ్యక్షుడు కైషమ్‌ మేఘచంద్ర సింగ్‌లు నాయకత్వం వహించారు.
సమస్యలను పరిష్కరించాల్సిన వారే మణిపూర్‌లో మంటలు రాజేస్తున్నారు
సమస్యలను పరిష్కరించాల్సిన వారే మణిపూర్‌కు నిప్పంటించారని బిషప్‌ డొమినిక్‌ లూమోన్‌ అన్నారు. ఆర్చ్‌బిషప్‌ హౌస్‌లో సీతారాం ఏచూరితో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ప్రతి జాతికి దాని సొంత ఆందోళనలు, భయాలు ఉన్నాయి. దీనిని ప్రభుత్వ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇది జరగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానమే ఘర్షణకు దారి తీసింది’ అని ఆర్చ్‌ బిషప్‌ అన్నారు. శాంతి చర్చలు జరగనందున సహాయక చర్యలు కూడా అసాధ్యమని ఆర్చ్‌ డియోసెస్‌ వికార్‌ జనరల్‌ వర్గీస్‌ అన్నారు. ‘సహాయ సామాగ్రి తీసుకువెళ్లే ట్రక్కులు రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. ఇంటర్నెట్‌ నిషేధంతో బ్యాంకులు, పోస్టాఫీసుల పనితీరుకు అంతరాయం కలుగుతోంది’ అని అన్నారు.

Spread the love