దర్యాప్తు సంస్థలే ఎన్డీఏ ప్రధాన భాగస్వాములు

– సమావేశానికి వారూ హాజరై ఉండాల్సింది: బృందా కరత్‌ ఎద్దేవా
– బీజేపీకి అధికారమే ప్రధానం
– దాని ఓటమికి అందరూ ఏకమవ్వాలి
– ఎన్డీఏలో సగం మంది ఫిరాయింపుదారులే
– యూసీసీ అంటే యూనిఫామ్‌ కమ్యునల్‌ కోడ్‌
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ, ఆదాయపన్ను శాఖలే ప్రధాన భాగస్వామ్య పక్షాలని సీపీఐ (ఎం) నేత బృందా కరత్‌ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీకి ఆ సంస్థలు హాజరై ఉండాల్సిందని ఆమె ఎద్దేవా చేశారు. బృందా కరత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి నుంచి దేశాన్ని కాపాడేందుకు తామంతా చేరువయ్యామని ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక రాజకీయాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఢకొీనే బలం ప్రతిపక్షాలకు ఉన్నదని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా సామాజిక శక్తులు, ఉద్యమాలు కూడా చేతులు కలపాలని పిలుపునిచ్చారు. భారత లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం కాకుండా అడ్డుకోవాలంటే అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ‘ప్రతి రాష్ట్రంలోనూ రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర స్థాయిలో ముందుగా కసరత్తు జరగాల్సి ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఉమ్మడి లక్ష్యంతో ఉన్నామన్న నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
ప్రతిపక్షాలకు కుటుంబమే ముఖ్యమని, ఆ తర్వాతే దేశం గురించి ఆలోచిస్తాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యపై బృందా కరత్‌ మండిపడుతూ మోడీ, బీజేపీలకు అధికారమే ముఖ్యమని, విలువలు, ప్రజలు ఆ తర్వాతేనని వ్యంగ్యంగా అన్నారు.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరైన వారిలో సగం మంది పార్టీ ఫిరాయింపుదారులేనని, వారు ఈడీ, సీబీఐ, ఐటీ దృష్టిలో మర్యాదస్తులని ఎద్దేవా చేశారు. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మహారాష్ట్ర పరిణామాలపై మాట్లాడుతూ బీజేపీ ఎవరి పైన అయితే అవినీతి ఆరోపణలు చేసిందో వారే ఇప్పుడు ఆ పార్టీకి అత్యంత సన్నిహితులైన భాగస్వాములయ్యారని చెప్పారు. ఇది బీజేపీ కపటత్వాన్ని బయటపెడుతోందని అన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని ప్రస్తావిస్తూ వాస్తవానికి అది ఉమ్మడి మతతత్వ కోడ్‌ (యూనిఫామ్‌ కమ్యునల్‌ కోడ్‌-యూసీసీ) అని బృందా కరత్‌ వ్యాఖ్యానించారు. వివిధ మతాలకు చెందిన నాయకులతో చర్చించి వ్యక్తిగత చట్టాలకు సవరణలు చేయాలని 21వ లా కమిషన్‌ సూచించిందని, అయితే ప్రభుత్వం తన మతతత్వ అజెండా కారణంగా దీనిని పట్టించుకోలేదని ఆమె అన్నారు. ప్రస్తుతం యూసీసీ వాంఛనీయం కాదని, దాని అవసరమూ లేదని లా కమిషన్‌ స్పష్టం చేసిందని బృందా కరత్‌ గుర్తు చేశారు.

Spread the love