రాజ్యాంగ విలువలపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ దాడి

మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ: ముస్లింలపై విద్వేషాన్ని వెళ్లగక్కుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యల్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు, భారత రాజ్యాంగానికి, పౌరులందరి సమాన హక్కులకు, చట్టపాలనకు బహిరంగ సవాల్‌ విసురుతున్నా యని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై జరిగిన దాడిగా అభివర్ణించింది. భగవత్‌ తీరును నిరసిస్తూ దేశ పౌరులు, లౌకికవాద శక్తులు తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చింది. ఈ అంశంపై పొలిట్‌బ్యూరో బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో, ”ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని మోహన్‌ భగవత్‌ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలు ఈ దేశంలో సురక్షితంగా ఉండాలంటే ‘ఆధిపత్య ఆలోచనలను’ వదులుకోవాల్సి ఉంటుందని బెదిరించాడు. హిందువులు యుద్ధంలో ఉన్నారని తెలుపుతూ, ముస్లింలపై విద్వేషాన్ని వెళ్లగక్కాడు. భారతదేశంలో ఒక వర్గానికి వ్యతిరేకంగా హింసకు దిగాలంటూ హిందువులకు పిలుపునిచ్చాడు. అణిగిమణిగి ఉండటానికి ఒప్పుకుంటేనే ముస్లింలు ఇక్కడ ఉండాలన్న గోవాల్కర్‌, హేగ్డేవార్‌ భావజాలాన్ని మోహన్‌ భగవత్‌ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా తరుచూ ముస్లింలను టార్గెట్‌ చేస్తున్నాడు”అని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. భగవత్‌ వ్యాఖ్యల్ని ప్రజలంతా ఖండించాలని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. భారత రాజ్యాంగం ప్రాథమిక విలువలపై దాడిగా పేర్కొంది.

Spread the love