ఏడు స్థానాల్లో నాలుగింట ఇండియా గెలుపు

– త్రిపురలో రిగ్గింగ్‌తో గట్టెక్కిన బీజేపీ
–  ఉత్తరప్రదేశ్‌లో ఘోర పరాభవం
–  కేరళలో కాంగ్రెస్‌కు ‘సానుభూతి’
న్యూఢిల్లీ : ఆరు రాష్ట్రాల్లో ఏడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలు 4 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌, జెఎంఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ ఒక్కొక్క స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.అధికార దుర్వినియోగంతో పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించి బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్న త్రిపురలోని ధనపుర్‌, బొక్సానగర్‌.. రెండు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు ఉత్తరాఖండ్‌లోని భగేశ్వర్‌ స్థానంలోనూ కాషాయ పార్టీ గెలుపొందింది. కాగా పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించింది. త్రిపురలో హింసాకాండపై ఎన్నికల సంఘానికి ఇప్పటికే
ఫిర్యాదు చేసిన సీపీఐ(ఎం) ఓట్ల లెక్కింపును కూడా బహిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా జార్ఖండ్‌లోని దుమ్రి స్థానంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి స్థానంలోనూ ప్రతిపక్ష ‘ఇండియా’ ఫోరం బిజెపిని మట్టి కరిపించాయి. దుమ్రిలో జెఎంఎం, ఘోసిలో సమాజ్‌వాదీ పార్టీ విజయఢంకా మోగించాయి. ఇది మతతత్వ రాజకీయాలపై ప్రగతిశీల రాజకీయాలకు దక్కిన విజయమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అభివర్ణించారు. ‘ఇండియా’ విజయం దిశగా భారత్‌ ప్రయాణానికి ఇది తొలి అడుగు అని ఆయన తెలిపారు.
జార్ఖండ్‌ : జార్ఖండ్‌లో దుమ్రి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) అభ్యర్థి బేబీ దేవీ ఎజెఎస్‌యు అభ్యర్థి యశోదా దేవీపై 17 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బేబీ దేవీకి 1,35,480 ఓట్లు లభించగా, యశోదాకు1,18,380 ఓట్లు లభించాయి. జార్ఖండ్‌ మాజీ మంత్రి జగరన్నాథ్‌ మహాతో మరణంతో ఇక్క డ ఉప ఎన్నిక నిర్వహించారు. బేబీ దేవీ జగరన్నాథ్‌ భార్య.
పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి ఉప ఎన్నికలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, కాలేజీ ప్రొఫెసర్‌ నిర్మలచంద్ర రారు 4,313 మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు 96,961 ఓట్లు లభించాయి. ఈ స్థానంలో 2021లో జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో మరణించిన సిఆర్‌పిఎఫ్‌ జవాను భార్య తాపసి రారుని బరిలో నిలిపి సానుబూతి ఓట్లతో గెలవాలని బీజేపీ వ్యూహాం పన్నినా ఆ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. బీజేపీకి 92,648 ఓట్లు లభించినట్లు అధికారులు తెలిపారు. సీపీఐ(ఎం) నుంచి పోటీ చేసిన ఈశ్వరచంద్ర రారుకి 13,666 ఓట్లు లభించాయి.
ఉత్తరాఖండ్‌లోని భగేశ్వర్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి పార్వతి దాస్‌ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి బసంత్‌ కుమార్‌పై 2400 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీ నేత చందన్‌రామ్‌దాస్‌ మృతితో ఇక్కడ పోలింగ్‌ అనివార్యమైంది. పార్వతిదాస్‌ ..చందన్‌ భార్య కావడంతో సానుబూతితో ఆమె విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘోషి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఘోర పరాభవాన్ని చవిచూసింది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్‌ సింగ్‌ సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తిరుగుబాటు నేత దారా సింగ్‌ చౌహాన్‌పై విజయం సాధించారు. అయితే ఈ వార్త రాసే సమయానికి అధికారికంగా ధ్రువీకరించలేదు. 2022లో ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరుపన పోటీ చేసి గెలుపొందిన దారాసింగ్‌ ఆ తర్వాత బీజేపీ గూటికి చేరారు. అయితే ఈ దఫా ఆయనకు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన అప్నాదళ్‌ (సోనేలాల్‌), నిర్బల్‌ ఇండియన్‌ సోషిత్‌ హమారా ఆమ్‌ దళ్‌ (నిషద్‌) పార్టీ, సుహేల్‌ దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ మద్దతు ఇచ్చాయి. సమాజ్‌వాది పార్టీకి ఇండియా ఫోరం పార్టీలు కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్‌ఎల్‌డి, ఆప్‌, సీపీఐ(ఎంఎల్‌)- లిబరేషన్‌, సుహేల్‌ దేవ్‌ స్వాభిమాన్‌ పార్టీ మద్దతు ఇచ్చాయి.
పుతుప్పల్లిలో చాందీ ఊమెన్‌ విజయం
కేరళలో మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మృతితో ఉప ఎన్నిక నిర్వహించిన పుతుప్పల్లిలో ఆయన కుమారుడు, యునెటైడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి చాందీ ఊమెన్‌ 37,719 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొట్టాయం జిల్లాలో కాంగ్రెస్‌కు పెట్టనికోటగా వున్న ఈ నియోజకవర్గానికి ఊమెన్‌ చాందీ 1970 నుండి ఈ ఏడాది జులై 18న మరణించేవరకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన మృతితో ఈ సీటుకు ఉప ఎన్నిక అవసరమైంది. సీపీఐ(ఎం)కి చెందిన ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి జైక్‌ సి.థామస్‌ 41,644 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్ధి లిజిన్‌ లాల్‌కు కేవలం 6,447 ఓట్లు లభించాయి. మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆప్‌ అభ్యర్ధి లూక్‌ థామస్‌కు 829ఓట్లు లభించాయి. ఊమెన్‌ చాందీ మృతి పట్ల ప్రజల్లో సానుభూతి నెలకొనడంతో ఆయన కుమారుడు విజయం సాధించారు. తన ఈ విజయం తండ్రిదేనని, ఆయన 13వసారి విజయం సాధించారని చాందీ ఊమెన్‌ వ్యాఖ్యానించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్‌ మాట్లాడుతూ, బిజెపి ఓట్లలో ప్రధాన వాటా యుడిఎఫ్‌కు అనుకూలంగా పడ్డాయన్నారు. ‘సానుభూతి గురించి మాకు తెలుసు, ఈ విజయానికి గల కారణాలను సిపిఎం పరిశీలిస్తుంది. ఈ సానుభూతి పవనాలు వీస్తున్నపుడు కూడా పుతుప్పల్లిలో ఎల్‌డిఎఫ్‌ రాజకీయ పునాదులు చెక్కుచెదరలేదు.” అని వ్యాఖ్యానించారు.
త్రిపురలో రిగ్గింగ్‌ !
త్రిపురలో తీవ్ర హింసాకాండ చోటుచేసుకున్న బోక్సానగర్‌లో 66 శాతం (30237) ఓట్ల భారీ మెజార్టీతో బిజెపి అభ్యర్థి తఫాజ్‌జల్‌ హోస్సాయిన్‌ గెలుపొందారు. ఆయనకు మొత్తం 34,146 ఓట్లు రాగా సీపీఐ(ఎం) అభ్యర్థికి 3,909 ఓట్లే వచ్చాయి.
పోలింగ్‌ కేంద్రాలను ఆక్రయించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న విమర్శలకు ఈ భారీ మెజార్టీ లభించడం బలం చేకూర్చుతోందని విశ్లేషకులు పేర్కొన్నారు. సీపీఐ(ఎం)కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో 4 వేలు లోపే ఓట్లు లభించడం అధికార పార్టీ స్థానిక నేతలను సైతం విస్మయానికి గురి చేసింది. ఇదే రాష్ట్రంలోని రెండో స్థానమైన ధనపుర్‌ స్థానంలోనూ బీజేపీ అభ్యర్థి బిందు దేవనాథ్‌ 18,871 భారీ ఓట్ల వ్యత్యాసంతో విజయం సాధించారు. ఆయనకు 30017 ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) నేత కౌశిక్‌ చంద్రకు 11,146 ఓట్లు లభించాయి. తీవ్రస్థాయిలో ఎన్నికల అక్రమాలకు బిజెపి పాల్పడిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీపీఐ(ఎం) బహిష్కరించింది. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. బోక్సానగర్‌లో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే శ్యామూల్‌ హక్‌ మృతి కారణంగా ఉప ఎన్నిక నిర్వహిం చారు. ధనపుర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిమా భౌమిక్‌ను కేంద్ర మంత్రిగా నియమించిన నేపథ్యంలో రాజీనామా చేయగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Spread the love