అంతులేని విషం

Endless poison– హిందూత్వ శక్తుల గ్రూపులు, యూట్యూబర్ల కథనాలే మూలం
– ‘ఆ వర్గం’పై ప్రజల్లో ప్రతికూలత కలిగేలా తీవ్ర ప్రచారం
– ఇందుకు కవిత్వాలు, పాటలనూ వదలని కాషాయపార్టీ
– ప్రధాని మోడీ, బీజేపీ తీరుపై మేధావులు, సామాజిక కార్యకర్తల ఆగ్రహం
న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా మోడీ పాలనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం సాగింది. ముఖ్యంగా, కరోనా కాలంలో ఆ వర్గం వారిని సూపర్‌ స్ప్రెడర్స్‌(కరోనా మహమ్మారి వ్యాప్తిని వేగంగా వ్యాప్తి చెందించేవారు)గా కొన్ని హిందూత్వ శక్తులు తీవ్ర ప్రచారం చేశాయి.
బీజేపీ అనుకూల మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్లు సైతం ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాయి. ఆ మతానికి వ్యతిరేకంగా కొన్ని కథనాలను తయారు చేసి సమాజంలోకి వదిలి ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటే ప్రయత్నాలను చేశాయి. ముఖ్యంగా, ఇందుకు హిందూత్వ శక్తుల మత సమావేశాలు, వాట్సప్‌ సందేశాలు, యూట్యూబ్‌ ఛానెళ్లు, ‘హిందూత్వ’, హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేసే విధంగా పాటలు, కవిత్వాలను రూపొందించే గాయకులు, వ్యక్తులు మూల వనరులుగా ఉన్నారు.
ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం కొన్ని వారాలుగా ఆ వర్గం మైనారిటీలపై బీజేపీ విషం చిమ్ముతున్నది. ముఖ్యంగా, ప్రధాని హౌదాలో ఉన్న మోడీనే ఇందుకు కేంద్ర బిందువయ్యారు. బీజేపీ, ప్రధాని చేసే ప్రచారాల తీరును మేధావులు, సామాజికవేత్తలు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ వర్గానికి చెందిన వ్యక్తులకు మద్దతుగా ఉంటుందనీ, హిందువులు మాత్రం తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకోవటానికి అవకాశాలుండవనీ, ఆ వర్గం వారు ఆదివాసీ, గిరిజనుల భూములను ఆక్రమిస్తారని హిందూత్వ గ్రూపులు పలు సమావేశాలు, సోషల్‌ మీడియా ఖాతాల్లో ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఈ హిందూత్వ గ్రూపుల ప్రచారానికి బలం కల్పించేది ప్రధాని హౌదాలో మోడీ చేస్తున్న విషపూరిత ప్రసంగాలేనని మేధావులు, సామాజిక కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
‘ల్యాండ్‌ జిహాద్‌’ అంటూ ఆరోపణలు
ఆ వర్గం మైనారిటీలు చేసే ఏ పనినైనా సంఘవిద్రోహ కోణంలోనే చూసే ధోరణిని అలవాటు చేసుకున్న హిందూత్వ శక్తులు.. వాటినే ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పుదారి పట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో భూములను ఆక్రమించుకోవటానికి ఆ వర్గం వారు కుట్ర పన్నుతున్నారని ఏడాది నుంచి హిందూత్వ శక్తులు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. దీనిని ‘ల్యాండ్‌ జిహాద్‌’గా అభివర్ణించాయి. తమిళనాడు, కేరళ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ వంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఆ మైనారిటీ వర్గానికి అవసరమైన భూమిని, నిధులను కేటాయించినా.. బీజేపీ శ్రేణులు, హిందూత్వ శక్తులు ఆ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ విపరీత ప్రచారాలు చేస్తున్నాయి.
ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం కోసం ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ఆ మైనారిటీ వర్గాన్ని మాత్రం టార్గెట్‌ చేయకుండా ఉండలేకపోతున్నారు. జార్ఖండ్‌ పర్యటనలోనూ.. జేఎంఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎలాంటి తనిఖీలు లేకపోవటంతో ”చొరబాటుదారులు” వస్తున్నారనీ, ఓటు బ్యాంకు కోసం ఈ పార్టీలు ఏమైనా చేస్తాయని మోడీ ఆరోపణలు గుప్పించారు. ఈ చొరబాటుదారులు ఆదివాసీల భూములను లాక్కొంటారనీ, జార్ఖండ్‌లోని సంతల్‌ పరజ్ఞ వంటి ప్రాంతాల్లో మహిళలకు భద్రత లేదని ప్రధాని చెప్పటం గమనార్హం.
ఆదివాసీ మహిళలను ఒక వర్గం పురుషులు వివాహం చేసుకొని, వారి భూములను ఆక్రమిస్తున్నారనే పరోక్ష ఆరోపణలను ఆయన చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలూ లేకుండానే ప్రధాని హౌదాలో మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. హిందూత్వ శక్తులు, గ్రూపుల కుట్ర కథనాలనే మోడీ తన బాధ్యతను విస్మరించి వినిపిస్తున్నారని మేధావులు, సామాజిక, మైనారిటీ హక్కుల కార్యకర్తలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
పాటలు, కవిత్వాలను కూడా ఆ వర్గంపై విషం చిమ్మటానికి ఉపయోగిస్తున్నాయి హిందూత్వ శక్తులు, బీజేపీ శ్రేణులు. రోహతక్‌కు చెందిన ఒక గాయకురాలు కవి సింగ్‌.. ఆర్టికల్‌ 370 రద్దుపై మోడీని పొగుడుతూ.. ఒక వర్గం ప్రజలను మాత్రం దేశద్రోహులు, చొరబాటుదారులుగా, ఎక్కువ మంది పిల్లలను కనేవారిగా వర్ణిస్తూ పాటను రూపొందించటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నదని మేధావులు చెప్తున్నారు.

Spread the love