కవితకు కస్టడీ పొడిగింపు

కవితకు కస్టడీ పొడిగింపు– ఈడీ కేసులో14, సీబీఐ కేసులో 20 వరకు రిమాండ్‌
– రేవణ్ణను దేశం దాటించి, నాలాంటి వాళ్లను అరెస్ట్‌ చేస్తారా?: కవిత
– బెయిల్‌ పై నేడు ఢిల్లీ హైకోర్టు ముందుకు..
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు మరోసారి జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించింది. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించిన ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులో 14 వరకు కస్టడీని పొడిగించిన కోర్టు, సీబీఐ కేసులో 20 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈడీ, సీబీఐ కేసులో గతంలో కవితకు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో… మంగళవారం మధ్యాహ్నం కవితను జైలు సిబ్బంది స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా ముందు హాజరుపర్చారు. తొలుత ఈడీ కేసులో వాదనలు జరగగా… కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ తరపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌ కె మట్ట కోర్టుకు వివరించారు. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కవిత కస్టడీని పొడిగించాలని కోరారు. అంతకు ముందు కవిత న్యాయవాదులు నితేశ్‌ రాణా, మోహిత్‌ రావులు మూడు విజ్ఞప్తులను కోర్టు ముందుకు తెచ్చారు. కవితను కలిసేందుకు హైదరాబాద్‌ నుంచి తమ కుటుంబ సభ్యులు వచ్చారని, కవితతో 15 నిమిషాలు మాట్లాడేందుకు వారిని అనుమతించాలని కోరారు. అలాగే జైలులో కవితకు మరో 10 పుస్తకాలు అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌ లో కవితకు తన భర్త తెచ్చిన ఆహారం తినేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జైలులో కవితకు ఇంటి భోజనం అందించేందుకు మార్చి 26 ఆదేశాల్లో కోర్టు అనుమతించిందని, అయితే ఈ భోజనాన్ని 10, 15 మంది జైలు సిబ్బంది చెక్‌ చేయడంతో కలుషితం (కాంటామినేషన్‌) అవుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. అందువల్ల హౌం ఫుడ్‌ ఇవ్వడం ఆపేసామని, అలా కాకుండా జైలు డాక్టర్‌ చెక్‌ చేసి కవితకు ఫుడ్‌ అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన జడ్జి, ఇంటి భోజనం ఆపేసిన తరువాత మళ్లీ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. కవితకు ఇంటి భోజనం అందించే అంశంపై జైలు సూపరింటెండెంట్‌ వివరణ కోరతామని చెప్పారు. అనంతరం ఈడీ వాదనలను పరిగణలోకి తీసుకొని కవిత జ్యుడీషియల్‌ కస్టడీని 14 వరకు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కోర్టు లాకప్‌లో కవితను కలిసేందుకు అనుమతించడంతో పాటు, జైల్లో చదువుకునేందుకు వీలుగా మరో 10 పుస్తకాలకు అనుమతి ఇచ్చారు. అనంతరం ఆమెను కోర్టుకు తరలించారు.
సీబీఐ కేసులో 20 వరకు కస్టడీ..
సీబీఐ కేసులో కస్టడీపై అరగంట వ్యవధిలోనే వాదనలు జరిగాయి. సీబీఐ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పంకజ్‌ గుప్తా వాదనలు వినిపించారు. కేసు వ్యవహారంలో మరింత మందిని విచారించాల్సి ఉందని, కీలక అంశాలు రాబట్టాల్సి ఉందని అన్నారు. దర్యాప్తు సజావుగా సాగేందుకు కవిత కస్టడీని పొడిగించాలని కోరారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీని 20 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. తదుపరి విచారణ మే 20న చేపడతామని స్పష్టం చేసింది.
వారం రోజుల్లో కవితపై చార్జీ షీట్‌ దాఖలు : ఈడీ
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత పాత్రపై వచ్చే వారం రోజుల్లో చార్జీ షీట్‌ దాఖలు చేయనున్నట్టు ఈడీ తరఫు న్యాయవాది ఎన్‌ కె మట్ట కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైలింగ్‌ తుది దశకు చేరినట్టు ఆయన మీడియాకు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.
రేవణ్ణను దేశం దాటించి, నాలాంటి వాళ్లను అరెస్ట్‌ చేస్తారా? : కవిత
ప్రజ్వల్‌ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి, తనలాంటి వాళ్లను అరెస్ట్‌ చేయడం అన్యాయమని కవిత అన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఆమె కోరారు. కోర్టు హాల్లోకి వెళ్లే ముందు కేవలం జై తెలంగాణ, జై భారత్‌ అనే నినాదాలు చేశారు. అయితే సీబీఐ కేసులో విచారణ తరువాత బయటకు వచ్చిన కవిత, రేవణ్ణ అంశాన్ని ముడిపెడుతూ కేంద్రంలోని బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు.
బెయిల్‌పై నేడు హైకోర్టుకు కవిత
ఈడీ, సీబీఐ కేసుల్లో రౌస్‌ ఎవెన్యూ కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో నేడు (బుధవారం) కవిత ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను చాలెంజ్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ నున్నట్టు ఆమె భర్త అనిల్‌ తెలిపారు. పీఎంఎల్‌ఏ చట్టం లోని నిబంధనలకు విరుద్ధం, అక్రమంగా కవితను అరెస్ట్‌ చేశారని పిటిషన్‌ లో పేర్కొననున్నట్టు తెలిసింది. అలాగే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ కు ముందు రోజు ఆమెను అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేయనున్నట్టు సమాచారం.

Spread the love