కేజ్రీవాల్‌ బెయిల్‌ పై విచారణ

కేజ్రీవాల్‌ బెయిల్‌ పై విచారణ– సుప్రీంకోర్టు షరతులు
– 20 వరకు పొడిగించిన జ్యుడీషియల్‌ కస్టడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పై అత్యున్నత న్యాయ స్థానం విచారణ జరిపింది. అయితే బెయిల్‌ పై సుప్రీంకోర్టు షరతులు విధించి, తీర్పును రిజర్వ్‌ చేసింది. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తలతో కూడిన ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణ గురువారం లేదా వచ్చే వారంలో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తే.. అప్పుడు ఎక్సైజ్‌ పాలసీ కేసుతో లింకున్న ఫైల్స్‌ను కేజ్రీ చూడరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది. అయితే, సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని అభిప్రాయపడింది. కేసుల విషయంలో రాజకీయ నాయకులకు మినహాయింపు ఉండకూడదని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలూ విన్న అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది.
14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ
ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కస్టడీని మరోసారి రౌస్‌ అవెన్యూ కోర్టు పొడగించింది. మంగళవారంతో కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో అధికారులు ఆయన్ను తీహార్‌ జైలు నుంచి రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా, కేజ్రీవాల్‌కు 20 వరకు కస్టడీని పొడిగించారు. దీంతో కేజ్రీవాల్‌ మరో 14 రోజులు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.

Spread the love