– మోడీపై మండిపడిన రాహుల్
– బాండ్ల పథకం ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ స్కీమ్
– బీజేపీ స్కోరు 150 దాటదు
– అమేథీలో పోటీపై పార్టీదే నిర్ణయం
ఘజియాబాద్ : మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ స్కీమ్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీని ఆయన అవినీతికి ఛాంపియన్‌గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కౌషంబీలో ఆయన బుధవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమికి అనుకూలంగా బలమైన గాలులు వీస్తున్నాయని, బీజేపీ 150 సీట్లకే పరిమితం అవుతుందని రాహుల్ చెప్పారు. ఎన్నికల నిధులలో పారదర్శకత కోసమే బాండ్ల పథకాన్ని తీసుకొచ్చామని ప్రధాని చెబుతున్నారని అంటూ…. అలాంటప్పుడు దానిని సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసిందని రాహుల్ ప్రశ్నించారు. ‘ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ పథకం. ఆ విషయం మన దేశంలో వ్యాపారులకు బాగా తెలుసు. ప్రధాని ఎంతగా వివరణ ఇస్తున్నప్పటికీ దాని ప్రభావమేమీ ఉండదు. ఎందుకంటే అవినీతికి ప్రధాని ఛాంపియన్ అని విషయం దేశానికంతా తెలుసు’ అని అన్నారు. కాలపరిమితితో నిమిత్తం లేకుండా పేదరికాన్ని కాంగ్రెస్ నిర్మూలిస్తుందంటూ తాను చేసిన వ్యాఖ్యలను మోడీ విమర్శించడాన్ని రాహుల్ ప్రస్తావించారు. పేదరికం అనేది ఒక్కసారిగా పోయేది కాదని, అయితే అందుకోసం తాము బలమైన ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో అమేథీ నుండి పోటీ చేయడంపై అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిస్తూ ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. అలాంటి నిర్ణయాలను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకుంటుందని అన్నారు. కాగా పశ్చిమ యూపీలోని ఘజియాబాద్ నుండి ఘాజీపూర్ వరకూ రాజకీయ పవనాలలో మార్పు కన్పిస్తోందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఘనంగా వీడ్కోలు పలుకుతామని అఖిలేష్ తెలిపారు. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చీలకుండా ప్రయత్నిస్తామని అన్నారు.