– ఇజ్రాయిల్ కంపెనీతో అదానీ జాయింట్ వెంచర్
– అయిదేండ్లుగా హెర్మ్స్900 డ్రోన్లు సరఫరా
– వ్యూహాత్మక, రక్షణ పరిశ్రమలోకి ఇజ్రాయిలీ కంపెనీ ప్రవేశం
– రక్షణ రంగంలో ఎఫ్‌డిఐ నిబంధనల సడలింపు ఇందుకోసమేనా?
న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన అనుంగు మిత్రుడైన అదానీ కోసం దేశ ప్రతిష్టను పణంగా పెట్టింది. గాజాలో వేలాది మంది పాలస్తీనీయుల ఊచకోతకు ఉపయోగిస్తున్న డ్రోన్లలో చాలా వరకు అదానీ కంపెనీ సప్లై చేస్తున్నవేనని ది వైర్, అదానీ వాచ్‌తో సహా పలు మీడియా సంస్థలు ఆధారాలతో సహా వెల్లడించాయి. దేశ ప్రతిష్టతో బాటు జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న కీలకమైన ఈ వార్తా కథనాలపై కేంద్ర రక్షణ శాఖ కానీ, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కానీ, విదేశాంగ శాఖ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇజ్రాయిల్‌కు జర్మనీ ఆయుధాలు సరఫరా చేస్తున్నందుకు గాజాలో రక్తపాతంతో ఆ దేశానికి సంబంధముందని, కాబట్టి జర్మనీని నికరాగ్వా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు లాగింది. ఇజ్రాయిల్‌కు ఆయుధాలు అందజేస్తున్న అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపుతున్నారు. ఇజ్రాయిల్ గత ఆరున్నర మాసాల్లో 34 వేల మంది పాలస్తీనీయులను ఊచకోత కోసింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే. ఇజ్రాయిల్ దాష్టీకాలపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమైన తరువాత కూడా అదానీ డ్రోన్ల సరఫరా ఆగలేదు. బొగ్గు మైనింగ్ కాంట్రాక్టులకు సంబంధించి అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇజ్రాయిలీ ఆయుధ తయారీ సంస్థ ఎల్‌బిట్ సిస్టమ్స్‌తో కలసి 2018లో హైదరాబాద్ సమీపంలో అదానీ ఎయిరో స్పేస్ పార్కులో 15 మిలియన్ డాలర్లతో జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. రెండేళ్ల తరువాత అంటే 2020 ఫిబ్రవరి6న అదానీ డిఫెన్స్ ఎయిరో స్పేస్, ఎల్‌బిట్ సిస్టమ్స్‌తో కలసి ప్రైవేట్ మానవ రహిత యుద్ధ విమానాల (యుఎవి) తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. ఇక్కడ తయారైన హెర్మ్స్ 900 డ్రోన్లు (వీటిని దృష్టి-10 అని కూడా పిలుస్తారు), యుఎవిలను అదానీ కంపెనీ ఇజ్రాయిల్‌కు సప్లై చేస్తోంది. ఇప్పటివరకు 20కి పైగా యుఎవిలను, డ్రోన్లను అందించింది. ఇజ్రాయిల్‌కు అదాని డ్రోన్లు సప్లయి గురించి హిందుస్థాన్ టైమ్స్ పత్రిక జనవరిలో ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించింది. అదానీ గ్రూపు దీనిపై స్పందిస్తూ ఇజ్రాయిల్‌కు డ్రోన్లు, యుఎవిలు సప్లయి చేసిన మాట నిజమే. అయితే ఇవి యుద్ధేతర అవసరాల కోసం పంపినవేనని వివరణ ఇచ్చింది.
గత ఫిబ్రవరిలో దివైర్‌తో సహా దేశ విదేశాల్లోని వివిధ మీడియా సంస్థలు వరుసగా కొన్ని కథనాలను ప్రచురించాయి. తాజాగా ది వైర్ రాసిన కథనంలో భారత్ ఐరాస తీర్మానాల విషయంలో వేసిన కుప్పిగంతులకు, అదానీ డ్రోన్లకు ఉన్న లింక్‌ను గురించి బయటపెట్టింది. గాజాలోకాల్పుల విరమణ పాటించాలని కోరుతూ 2023 డిసెంబరులో ఐరాస జనరల్ అసెంబ్లీలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన భారత్, ఈ నెల5న ఐరాస మానవహక్కుల సంస్థ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి)లో అదే విధమైన తీర్మానం ఓటింగ్‌కు వచ్చినప్పుడు గైర్హాజరైంది. భారత్ వైఖరిలో ఈ మార్పుకు అమెరికా ఒత్తిడితో బాటు, అదానీ డ్రోన్ల సప్లయి కూడా ఒక ముఖ్య కారణమని ఆ కథనం వెల్లడించింది. ఆ తీర్మానం కాల్పుల విరమణ పాటించాలని కోరడంతో బాటు ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫరాపై నిషేధం విధించాలని కూడా మిగతా 2లో
డిమాండ్ చేస్తున్నది. హిందుస్తాన్ టైమ్స్ ఈ ఏడాది జనవరిలోనే ఇందుకు సంబంధించిన ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. అదానీ, ఇజ్రాయిల్ కంపెనీల జాయింట్ వెంచర్, రక్షణ పరికరాల తయారీలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి ఆటంకం లేకుండా చూడడం కోసం మోడీ ప్రభుత్వం అంతకు ముందే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానం ప్రకారం ఆటోమెటిక్ రూట్‌లో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)ని అనుమతిస్తున్నది. కేస్ బై కేస్ ప్రాతిపదికపై వంద శాతం క్లైమేట్ రంగాన్ని ప్రధానంగా విదేశీ ఉత్పత్తిదారులకు, వ్యూహాత్మక భాగస్వాములుగా అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఇజ్రాయిల్‌కు అదానీ డ్రోన్ల ఎగుమతికి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వశాఖ అధీనంలోని డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) లైసెన్సు ఇచ్చింది. డ్రోన్లు, యుఎవిలే కాదు, టవర్ అసాల్ట్ రైఫిల్, అసాల్ట్ రైఫిల్ ఎక్స్95, గెలీల్ స్నిప్పర్ రైఫిల్, నెగెవ్ లైట్ మెషిన్ గన్స్, యుజి సబ్‌మెషినరీ గన్స్ వంటివి ఇజ్రాయిలీ కంపెనీతో కలసి అదాని ఏరో స్పేస్ ఉత్పత్తి చేస్తోంది. ఈ డ్రోన్లను, మానవ రహిత యుద్ధ విమానాలను, ఆయుధాలను భారత సాయుధ బలగాల్లో ప్రవేశపెట్టేందుకు కూడా అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ రంగంలోని డిఆర్‌డిఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి ప్రఖ్యాత సంస్థలను నిర్వీర్యం చేసి అదాని ఏరోస్పేస్‌కు ఆర్డర్లు ఇవ్వడం దేశ భద్రతకు మంచిది కాదని రక్షణ రంగ నిపుణులు పలువురు హెచ్చరిస్తున్నారు.
2018లో అదాని ఎంటర్‌ప్రైజెస్, ఇజ్రాయిలీ ఆయుధ తయారీ సంస్థ ఎలిబిట్‌తో కలసి
హైదరాబాద్‌లోని అదానీ ఎయిరో స్పేస్ పార్కులో జాయింట్ వెంచర్ యూనిట్ ఏర్పాటు
2020 ఫిబ్రవరి6 అదానీ డిఫెన్స్ ఎయిరో స్పేస్, ఎలిబిట్ కలసి ప్రైవేట్ యుఎవి యూనిట్ కాంప్లెక్స్ నెలకొల్పాయి
హెర్మ్స్900 డ్రోన్ల నిఘాకు, వైమానిక దాడులకు ఉపయోగించవచ్చు.
32వేల అడుగుల ఎత్తులో పయనిస్తూ భూమి మీద, సముద్రం మీద లక్ష్యాలను సులువుగా పసిగట్టే సామర్యం కలిగి ఉన్నాయి.
2014లో గాజాపై 50 రోజుల పాటు సాగించిన దాడుల్లో హెర్మ్స్ డ్రోన్లను మొదటిసారి ఉపయోగించింది.